స్వాగతం!

e-తెలుగు కంప్యూటర్లలో మరియు అంతర్జాలంలో తెలుగును వ్యాపింపజేయాలనే ధ్యేయంతో పనిచేసే లాభాపేక్షలేని సంస్థ. ఇది e-తెలుగు సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైటు.

తెలుగువారందరూ తమ అవసరాలకి కంప్యూటర్లనూ, మెబైళ్ళనూ, అంతర్జాలాన్నీ తెలుగులో వాడుకోగలగాలి. అదే మా స్వప్నం. ఆ దిశగా మేము కృషిచేస్తున్నాం.
మీ కంప్యూటర్లో తెలుగును స్థాపించుకోడానికి సహాయం కావాలా? చూడండి.
Need help for Telugu in your computer? Click here.
తెలుగులో వ్రాయాలనుకుంటున్నారా? లేఖిని చూడండి.

e-తెలుగు కంప్యూటర్లలో మరియు అంతర్జాలంలో తెలుగును వ్యాపింపజేయాలనే ధ్యేయంతో పనిచేసే సంస్థ. ఇది లాభాపేక్షలేని సంస్థగా అంద్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద నమోదయింది.

లక్ష్యం

''తెలుగువారందరూ తమ అవసరాలకి కంప్యూటర్లనూ, మెబైళ్ళనూ, అంతర్జాలాన్నీ తెలుగులో వాడుకోగలగాలి." అదే e-తెలుగు స్వప్నం. ఆ దిశగా e-తెలుగు కృషిచేస్తోంది.

పై లక్ష్యసాధనను ఈ క్రింది అంచెలలో సాధించాలి.

 • పరిచయం: కంప్యూటర్లలో తెలుగును చూడవచ్చు మరియు వ్రాయవచ్చని ప్రజలు తెలుసుకోవడం.
 • ఆదరణ: అంతర్జాల అనుసంధానమున్న సామాన్య ప్రజలందరూ తమ ఉత్తరప్రత్యుత్తరాలను తెలుగులోనే జరుపుకోవడం.
 • వ్యాప్తి: సాధారణంగా ఉపయోగించే వెబ్‌సైట్లు మరియు కంప్యూటర్ ఉపకరణాలు తెలుగులో అందుబాటులోకి రావడం
 • స్థిరత: రోజువారీగా వాడే సాఫ్టువేరు సాంకేతిక పదాలకు (అందరూ వాడుతుండడం వల్ల) ఓ స్థాయి ప్రామాణికత రావడం
 • విజృంభణ: సగటు తెలుగు వాడికి అవసరమైన కంప్యూటర్ సంభాషణ అంతా తెలుగులోనే జరుగుతుంది. అన్ని రకాల వెబ్‌సైట్లూ, ఉపకరణాలూ తెలుగులో కూడా లభిస్తాయి.

పై లక్ష్యాన్ని సాధించడానికి, కింది కార్యకలాపాలను e-తెలుగు తలపెట్టింది:

 • ప్రచారం/అవగాహన
  • అంతిమ వాడుకరులు:
   • తెలుగుని కంప్యూటర్లో చూడవచ్చు, వ్రాయవచ్చని, తెలుగులో జాలాన్ని అన్వేషించవచ్చని తెలియజేయడం.
   • రోజువారీ సంభాషణలని తెలుగులో జరుపుకోవడాన్ని అంతర్జాల మాధ్యమాల ద్వారా నెజ్జనులను ప్రోత్సహించడం.
   • తెలుగులో అందుబాటులో ఉన్న అంతర్జాల సేవలను తెలియజేయడం.
  • సాఫ్టువేరు ఉపకరణ తయారీదార్లు మరియు వికాసకులు: యూనికోడ్ మరియు దానివల్ల ప్రయోజనాలు తెలియజేయడం
 • సహాయం
  అంతిమ వాడుకరులు: కంప్యూటర్లో తెలుగు చేతనం చేసేందుకు అవసరమైన సాంకేతిక సహాయం
  ఉపకరణ తయారీదార్లు / జాల వికాసకులు: తెలుగులో ఉపకరణాలు మరియు జాలగూళ్ళు తయారుచేయడానకై తగిన సాంకేతిక సహాయం అందించడం.
 • స్థానికీకరణ
  1. వివిధ ఉపకరణాల తెలుగీకరణకు తోడ్పడడం
  2. కొత్త తెలుగు పదాల సృష్టి మరియు క్రోడీకరణ విషయమై జరిగే కృషికి ప్రచారం కల్పించడం
 • యూనీకోడీకరణ
  1. యూనీకోడ్ వలన కలిగే లాభాలు తెలియజేయడం
  2. సాంప్రదాయ/ప్రైవేటు సంకేతలిపుల నుండి యూనీకోడ్ లోనికి మార్పిడి చేయడంలో అవసరమైన సాంకేతిక సహాయం అందించడం
 • వికీ/స్వేచ్ఛా విషయాంగం
  1. తెలుగు వికీపీడియా మరియు ఇతర వికీమీడియా ప్రాజెక్టులలో పాల్గొనేలా తెలుగువారిని ప్రోత్సహించడం
 • తెలుగు గూళ్లు, బ్లాగులు
  1. ఖతుల (ఫాంట్లు) తయారీ: యూనికోడ్ తెలుగుకి సరిపడే విధంగా ఖతులను తయారీని ప్రోత్సహించడం
  2. బ్లాగు మూసల తయారీ: తెలుగు వాతావరణానికి అనుకూలమైన బ్లాగు మూసల తయారీని ప్రోత్సహించడం
 • స్పెల్ చెకింగ్

e-తెలుగు ఆవిర్భావం

అంతర్జాలంలో బ్లాగులు, గుంపులు వంటి వివిధ వేదికల ద్వారా తెలుగు బ్లాగరులు నిత్యమూ కలుసుకుంటూండేవారు. ముఖాముఖి కూడా కలిస్తే బాగుంటుందని ఆలోచించి 2006 మార్చి 12 న మొదటి సారి హైదరాబాదులో సమావేశమయ్యారు. అప్పటినుండి, ప్రతీనెలా రెండవ ఆదివారం నాడు హైదరాబాదు తెలుగు బ్లాగరులు, వికీపీడియనులు సమావేశమౌతూ వస్తున్నారు. ఈ సమావేశాలలో తెలుగు బ్లాగుల గురించిన సాధకబాధకాల గురించీ వికీపీడియా పురోగతి గురించీ చర్చించేవారు. తెలుగువారికి వీటిని గురించి తెలియజెయ్యడానికి ఏమేం చెయ్యాలి అన్న విషయాల గురించి కూడా చర్చిస్తూ ఉండేవారు. ముందుగా అతి తక్కువ శ్రమతో కంప్యూటరులో తెలుగు కనిపించేలా చేసుకోవచ్చనీ, ఇంగ్లీషులోలానే తెలుగులోనూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోవచ్చనీ, తెలుగువారికి తెలియజెయ్యాల్సిన అవసరం ఉందని గ్రహించారు. ఈ అంశాలను ప్రచారం చేసి, మరింతమంది ఔత్సాహికులను చేర్చుకొంటే, మరిన్ని పనులను, మరింత త్వరగా చేయగలమని భావించారు.

ఈ కార్యక్రమాలన్నిటినీ ఒక గొడుగు కిందకు చేర్చి, ఒక లాభాపేక్ష లేని సంస్థ ఆధ్వర్యంలో చేస్తే మెరుగైన ఫలితాలను సాధించవచ్చని భావించారు. ఆ ఆలోచన ఫలితం గానే e-తెలుగు సంఘం ఆవిర్భవించింది. ఆలోచన 2006 లోనే మొగ్గ తొడుగుకున్నా, దానిని అధికారికంగా 2008 ఏప్రిల్‌లో నమోదుచేయించారు.

కొన్ని ప్రధానమైన లింకులు

 1. e-తెలుగు సంఘ నిర్మాణం గురించి తెలుసుకోవడం కోసం, సభ్యుల జాబితా కోసం e-తెలుగు సంఘనిర్మాణం పేజీ చూడండి.
 2. e-తెలుగుకు సంబంధించి తరచూ అడుగుతూండే కొన్ని ప్రశ్నలకు సమాధానాలను సందేహాలు పేజీలో చూడండి.
 3. e-తెలుగు నిష్పూచీ (డిస్క్లెయిమర్) ను చూడండి
 4. e-తెలుగు ప్రచార సామాగ్రి చూడండి.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer