తరచూ అడిగే ప్రశ్నలు

వివిధ సందర్భాలలో e-తెలుగు సభ్యులకు ఎదురైన ప్రశ్నలు; అంటే పత్రిక, రేడియో, టీవీలలో e-తెలుగు మీద ఏదన్నా కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడో, e-తెలుగు సభ్యులను ముఖాముఖీ చర్చిస్తున్నప్పుడో ఎదురయే ప్రశ్నలను వాటి జవాబులను ఇక్కడ పొందుపరుస్తున్నాము. e-తెలుగు సభ్యులు మరియు ఔత్సాహికులు ఈ పేజీని తీర్చిదిద్దవలసినదిగా మనవి.

 1. e-తెలుగు అంటే ఏమిటి?
  e-తెలుగు అన్నది కంప్యూటర్లలో మరియు అంతర్జాలంలో తెలుగుని వ్యాపింపజేయాలనే ధ్యేయంతో పనిచేసే లాభాపేక్షలేని సంస్థ. ఇంగ్లీషు రాని సగటు తెలుగువాడు కూడా తన అవసరాలకి కంప్యూటర్లను (ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను), అంతర్జాలాన్ని వాడుకోగలగాలి. అన్నది e-తెలుగు స్వప్నం.
 2. e-తెలుగు ఎలా ఏర్పడింది
  అంతర్జాలంలో బ్లాగులు, గుంపులు వంటి వివిధ వేదికల ద్వారా తెలుగు బ్లాగరులు నిత్యమూ కలుసుకుంటూండేవారు. ముఖాముఖి కూడా కలిస్తే బాగుంటుందని ఆలోచించి 2005 మార్చి 12 న మొదటి సారి హైదరాబాదులో సమావేశమయ్యారు. అప్పటినుండి, ప్రతీనెలా రెండవ ఆదివారం నాడు హైదరాబాదు తెలుగు బ్లాగరులు, వికీపీడియనులు సమావేశమౌతూ వస్తున్నారు. ఈ సమావేశాలలో తెలుగు బ్లాగుల గురించిన సాధకబాధకాల గురించీ వికీపీడియా పురోగతి గురించీ చర్చించేవారు. తెలుగువారికి వీటిని గురించి తెలియజెయ్యడానికి ఏమేం చెయ్యాలి అన్న విషయాల గురించి కూడా చర్చిస్తూ ఉండేవారు. ఇవన్నీ చెయ్యడానికి ముందు అతి తక్కువ శ్రమతో కంప్యూటరులో తెలుగు కనిపించేలా చేసుకోవచ్చనీ, ఇంగ్లీషులోలానే తెలుగులోనూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోవచ్చనీ, తెలుగువారికి తెలియజెయ్యాల్సిన అవసరం ఉందని గ్రహించారు. ఈ అంశాలను ప్రచారం చేసి, మరింతమంది ఔత్సాహికులను చేర్చుకొంటే, మరిన్ని పనులను, మరింత త్వరగా చేయగలమని భావించారు.

  ఈ కార్యక్రమాలన్నిటినీ ఒక గొడుగు కిందకు చేర్చి, ఒక లాభాపేక్ష లేని సంస్థ ఆధ్వర్యంలో చేస్తే మెరుగైన ఫలితాలను సాధించవచ్చని భావించారు. ఆ ఆలోచన ఫలితం గానే e-తెలుగు సంఘం ఆవిర్భవించింది. ఆలోచన 2007 లోనే మొగ్గ తొడుగుకున్నా, దానిని అధికారికంగా 2008 ఏప్రిల్‌లో నమోదుచేయించి అప్పటి నుండే '''e-తెలుగు''' పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారు.

 3. e-తెలుగు ఏం చేస్తుంది?
  1. కంప్యూటరులో తెలుగును స్థాపించుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి అవసరమైన సాంకేతిక సహాయం అందిస్తుంది. ఇందుకవసరమైన సాఫ్టువేరు ఉపకరణాలను కూడా తయారుచేసి ఉచితంగా అందిస్తుంది.
  2. తెలుగులో టైపు చేసేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. లిప్యంతరీకరణకు అవసరమైఅన ఉపకరణాల గురించి ప్రచారం చేస్తుంది.
  3. ఇప్పటికే వివిధ కీబోర్డు లేఔట్లను వాడి తెలుగులో టైపు చేస్తున్నవారికి అవే లేఔట్లను వాడి యూనికోడులో కూడా టైపు చేసేందుకు అవసరమైన సాఫ్టువేరు ఉపకరణాలను తయారుచేసి, ఉచితంగా అందుబాటులో ఉంచింది. ఈ విషయమై ప్రచారమూ చేస్తోంది.
  4. అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికై చేసే కృషిలో భాగంగా బ్లాగులను, వికీపీడియాను, వెబ్ పత్రికలను, ఇతర తెలుగు వెబ్‌సైట్లను తెలుగువారికి పరిచయం చేస్తోంది.
  5. వివిధ సాఫ్టువేరు ఉపకరణాల స్థానికీకరణ గురించి తెలియని వారికి తెలియజేస్తూ, తెలిసిన వారికి వాటికి సంబంధించిన విషయాలలో సాంకేతిక సహాయం అందిస్తూ ప్రోత్సహిస్తోంది.
 4. e-తెలుగు సాధించిన విజయాలు; అధిగమించిన మైలురాళ్లు
  1. 2006 లో "''మీ కంప్యూటరుకు తెలుగు నేర్పడం ఎందుకు, ఎలా''" అనే పుస్తకాన్ని ముద్రించి ఉచితంగా ప్రజలకు పంచిపెట్టింది. ఈ కార్యక్రమం e-తెలుగు సంస్థను అధికారికంగా నమోదు చేయించక ముందే జరిగింది. ఈ పుస్తకాన్ని ఈ సైటునుండి దిగుమతి చేసికొనవచ్చు.
  2. 2008 డిసెంబరు 18 నుండి 28 వరకు హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఒక స్టాలును నిర్వహించి అంతర్జాలంలో తెలుగు వ్యాప్రి గురించి సందర్శకులకు వివరించింది. ఈ విషయమై మరిన్ని వివరాల కోసం ఈ సైటులోని నివేదికను చూడండి.
  3. 2009 జనవరి 4 న విజయవాడలోని పుస్తక ప్రదర్శన ప్రాంగణంలోని వేదికపై అంతర్జాలంలో తెలుగు గురించి ఒక ప్రదర్శనను నిర్వహించింది.
 5. e-తెలుగు ఏం చెయ్యదు?
  అంతర్జాలంలో తెలుగును వ్యాప్తి చేసేందుకు అవసరమైన ప్రచార కార్యక్రమాలు చెయ్యడం, సాంకేతిక సహాయం అందించడం e-తెలుగు లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో భాగంగా అవసరమైన కార్యక్రమాలను చేపడుతుంది. e-తెలుగుకు సంబంధం లేని విషయాల గురించి కింది జాబితాను గమనించవల్సినది.
  1. తెలుగు భాష మంచి చెడుల గురించి చర్చించదు
  2. తెలుగు భాషలోని వివిధ మాండలికాలు, యాసలు మొదలైనవాటి గురించి చర్చించదు
  3. గ్రాంథికం, వ్యావహారికం వంటి వివిధ రచనా శైలుల గురించి చర్చించదు
  4. తెలుగు సాహిత్యంలోని వివిధ వాదాలు, ఇజాలు, ఉద్యమాలు మొదలైనవాటి గురించి చర్చించదు
  5. సామాజికంగాను, విద్యారంగంలోను, ప్రసార మాధ్యమాల్లోను, పరిపాలనలోను, వ్యాపార వ్యవహారాల్లోను, తెలుగును అమలు చేసే విషయంలో కృషి చెయ్యదు.
  6. బ్లాగులలో ప్రచురింపబడే టపాలు, అంశాలకు సంబంధించి e-తెలుగుకు సంబంధం లేదు, వాటిపై e-తెలుగుకు ఎట్టి విధానమూ లేదు
  7. బ్లాగులలోను, వివిధ గుంపులలోను e-తెలుగు పేరిట జరిగే వివాదాలకు e-తెలుగుకు సంబంధం లేదు
  8. వివిధ గుంపులలో e-తెలుగుకు సంబంధించిగాని, మరే అంశానికి సంబంధించిగానీ జరిగే చర్చలు అధికారికంగా e-తెలుగుకు సంబంధించినవి కావు.
  9. వికీపీడియాకు, e-తెలుగుకూ ఏ సంబంధమూ లేదు.
  10. e-తెలుగుకు సంబంధించిన ఏ విధానమైనా ఈ వెబ్‌సైటులోనే (etelugu.org) ప్రచురించడం జరుగుతుంది. మరెక్కడైనా ప్రచురించే కథనాలకు, e-తెలుగు అధికారికంగా ప్రచురించే సందర్భాలలో తప్ప, e-తెలుగు బాధ్యత వహించదు.
 6. (తెలుగు) వికీపీడియా అంటే ఏమిటి; దాని ఉపయోగం ఏమిటి?
  వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఇది మామూలు వెబ్ సైట్ల వంటిది కాదు. ఇక్కడ సమాచారాన్ని చూడటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు. ఇక్కడ లేని సమాచారాన్ని చేర్చవచ్చు కూడా. ప్రపంచంలో ఉన్న 200 పైచిలుకు భాషలలో వికీపీడియా లభ్యమవుతుంది. తెలుగు వికీ భారతీయ భాషల అన్నింటికన్నా ముందంజలో ఉంది. ఇందులో ప్రస్తుతానికి 42 వేల పైనే వ్యాసాలు ఉన్నాయి. 8 వేలకు పైనే సభ్యులు ఉన్నారు. వికీపీడియాకు, e-తెలుగుకూ ఏ సంబంధమూ లేదు.
 7. e-తెలుగు కార్యాలయం ఎక్కడ ఉంది?
  e-తెలుగు ప్రధాన కార్యక్షేత్రం అంతర్జాలమే! అంతర్జాలంలో తెలుగును వ్యాప్తి చెయ్యడమే ప్రధాన ఆశయంగా పనిచేస్తున్నది కాబట్టి, e-తెలుగు కార్యకలాపాలన్నీ అంతర్జాలంలోనే కేంద్రీకృతమయ్యాయి. అంతర్జాలంలో e-తెలుగు కేంద్ర కార్యాలయం - http://etelugu.org, అనగా ఈ వెబ్‌సైటే. అంతర్జాలంలోనూ బయటా జరిపే కార్యక్రమాలన్నిటినీ ఈ వెబ్‌సైటు నుండే సంఘం సమన్వయపరుస్తూ ఉంటుంది.
 8. e-తెలుగు గురించి చెప్పే మరిన్ని లింకులేమైనా ఉన్నాయా
  ఉన్నాయి. కింది లింకులు చూడండి.
  1. e-తెలుగు సంఘ నిర్మాణం గురించి తెలుసుకోవడం కోసం, సభ్యుల జాబితా కోసం e-తెలుగు సంఘనిర్మాణం పేజీ చూడండి.
  2. e-తెలుగు నిష్పూచీ (డిస్క్లెయిమర్) ను చూడండి
  3. e-తెలుగు ప్రచార సామాగ్రి చూడండి.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer