తెలుగు బ్లాగర్ల సమావేశం

రెండు నెలల క్రితం ఢిల్లీ నుంచి హైద్రాబాద్ వచ్చేటప్పటికి తెలుగు బ్లాగర్ల సమావేశం అంటే ఎంతో ఆసక్తి వుండేది. ఈ రెండు నెలలలో జరిగిన రెండు సమావేశాలకు వచ్చిన తరువాత నిరుత్సాహం ఆవహించింది. కారణాలు వివరిస్తాను అవధరించండి -

మొదట నా సందేహం: ప్రతి నెలా రెండొవ ఆదివారం జరిగే సమావేశం ఈ-తెలుగు సమావేశమా లేక తెలుగు బ్లాగర్ల సమావేశమా? నాకు అర్థమైనంతలో ఇది ఈ సమావేశాలు ఈ-తెలుగు నిర్వహించే తెలుగు బ్లాగర్ల సమావేశాలు. ఆలాగైన పక్షంలో వీటి నిర్వహణ బాధ్యత ఈ-తెలుగు కార్యవర్గానిదే కాబట్టి ఈ విషయం ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

1. తెలుగు బ్లాగర్ల సమావేశం ప్రతి నెలా రెండొవ ఆదివారం జరపాలన్నది గతంలో తీసుకున్న నిర్ణయమైనప్పటికి ప్రతి నెలా ఆ విషయం మైలు ద్వారా తెలియజేయాల్సిన అవసరం వుందని నేను భావిస్తున్నాను. గత రెండు నెలలుగా అలాంటి మైల్ ఏదీ లేకపోగా కేవలం ఈ తెలుగు సభ్యులు వున్న గ్రూప్ మైల్‌లో సమావేశం వుందా లేదా అంటూ చర్చలు జరిగినట్టు గమనించాను. అంతే కాదు ఈ రెండు నెలలలో కొత్తగా బ్లాగులు మొదలుపెట్టిన తెలుగు బ్లాగర్లకు ఇలాంటి సమావేశం ఒకటి వున్నట్టు తెలిసే అవకాశమే లేదు.

2. దానికి తోడు సమావేశం సమయం మూడు గంటల నుంచి నాలుగు గంటలకు మార్చిన విషయం ఇప్పటికీ ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం ఫోన్లలో తరచూ మాట్లాడుకునే "క్లోస్డ్ సర్కిల్స్‌కి" మాత్రమే ఈ విషయం తెలుసు. గత రెండు సమావేశాల గురించి నేను ఒకరిద్దరికి ఫోన్ చేసి సమావేశం వున్నట్టు నిర్థారించుకోని వెళ్ళల్సి వచ్చింది.

3. సరే అదీ చేస్తాం.. ప్రతి నెలా రెండొవ ఆదివారం గుర్తుపెట్టుకొని, ఎన్నిగంటలకో కనుక్కోని సమావేశానికి వెల్తాం. అక్కడ వచ్చేది ముగ్గురు, లేదా నలుగురు. కారణం అడిగితే వరసగా శలవలొచ్చాయి కాబట్టి వూర్లు వెళ్ళారని ఒకసారి, ఎండలకి భయపడి రాలేదనీ, ఇండీ బ్లాగర్ల మీట్‌కి వెళ్ళారని చెప్పారు. సంతోషం.. ఎండలు ఎక్కువైనప్పుడు, ఇండీబ్లాగర్ల మీటింగ్ మన సమావేశం కన్నా ఎక్కువైనప్పుడు సమావెశం రద్దు చేస్తున్నట్టో, మరో సమయానికి మారుస్తున్నట్లో చెప్పాల్సిన బాధ్యత నిర్వాహకులకి లేదా?

4. సమావేశానికి రాని మిత్రులతో మాట్లాడితే అక్కడేదో రాజకీయాలు జరిగిపోతున్నాయని, తమ మాట వినేవాళ్ళే లేరంటూ నిరసనలు, మూతి విరుపులు..!! ప్రభుత్వం కాంగ్రేస్ దని చంద్రబాబు గారు అశంబ్లీకి వెళ్ళడం మానెయ్యాలా? ఇలాటి సమావేశాల్లో అలాంటి వాళ్ళ అవసరం ఎక్కువ అని నా అభిప్రాయం. ఇలా నిరసన ప్రకటిస్తున్న సభ్యులను సమావేశానికి వచ్చేట్లు చెయ్యాల్స్న అవసరం కూడా వుందని నా అభిప్రాయం.

5. సరే ఒకరో ఇద్దరో నలుగురో సభ్యులం సమావేశానికి వచ్చితిమి ఫో.. ఆ సమావేశం లో మంచో చెడో, రైటో రాంగో మాట్లాడతాం. ఆ విషయం మర్నాడో మరో నాడో మిగిలిన సభ్యులకి తెలియజేయాల్సిన బాధ్యత సమావేశం అటెండ్ అయిన కార్యవర్గ సభ్యులకు లేదా?

ఏదో ఎత్తిపొడుపు అనుకోకుండా, అభిమానంతో వుత్సాహంతో సమావేశానికి వచ్చిన ఒక బ్లాగర్ నిరుత్సాహాన్ని గమనిస్తారని ఆశిస్తూ.

అరిపిరాల

ముందుగా, ఈ విషయాలని

ముందుగా, ఈ విషయాలని ప్రస్థావించినందుకు నెనర్లు. అన్నీ అనుకుంటూనే ఉంటాం, చెయ్యాలనే అనుకుంటాం. కానీ ఎప్పటికప్పుడు, ఉదాసీనంగా, గడిపేస్తున్నాం. (నేనూ నిరుత్సాహంగా ధ్వనిస్తే, మన్నించండి.)

కానీ, ఇకనుండైనా క్రమపద్ధతిలో నిర్వహించడానికి ప్రయత్నిద్దాం.

నేను జనవరి నెలలో హైదరాబాద్

నేను జనవరి నెలలో హైదరాబాద్ రావాలనుకున్నాను. తెలంగాణా, సమైక్యాంధ్ర రైల్ రోకోలు వల్ల రాలేకపోయాను. ఈ-తెలుగు సభ్యునిగా గ్రూప్ నుంచి వచ్చే కొన్ని మెయిల్స్ చదివాను. ఈ మధ్య సమావేశాలు జరిగాయా లేదా, ఏమి చర్చించుకున్నారు వంటి విషయాలు తెలియవు.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer