తెలుగు భాష-వైభవం?

తేనె వంటిదీ మన తెలుగు కదా
’మరి చే’దెలా అయ్యింది మాతృభాష-మన మాతృభాష
అమ్మ అంటెనే హాయికదా
’మమ్మీ’ అనుమాటలో ప్రేతమనీ తోచదా
కన్నతల్లి కన్నమిన్న ఇంకేది లోకాన
సొంతఊరు అవ్వనుడుగు సాటిలేనివెపుడైనా
1. క్షరము కానిదే అక్షరము కదా
కొఱవడుతున్నాయెలా క్ష ఱ లు
సమసిపోనిదే వర్ణం కదా
లుప్తమెలా అయ్యాయి ఌ ౡ లు
ఇంద్ర ధనుసు కున్నవి ఏడే వర్ణాలు
తెలుగు భాష వర్ణాలు యాభయ్యారు
2. ఋణములు,ౠకలు నిత్యాగత్యమే కదా
మాయమెలా అయ్యాయి ఋ,ౠలు
మనఃపూర్వకంగా తెనుఁగు అనాలన్నా
అవసరమవుతాయికదా అరసున్నా విసర్గలు
భిన్నమైన యాసలే తెలుగు గర్వకారణం
ముత్యాల దస్తూరే తెలుగులిపికి ఆభరణం
3. అచ్చరువొందే అచ్చరాలే
అచ్చతెనుఁగుకే మెచ్చుతునకలు
దేశ భాషల్లో తెలుగు లెస్సగా
రాయల పలుకులే జిలుగు కణికలు
నిలపాలి మనమెప్పుడు తెలుగు ఆత్మగౌరవము
గుర్తెరిగీ మసలాలి తెలుగు భాష గొప్పదనం
తూర్పులోని ఇటలిభాషగ కీర్తించెను ప్రపంచం

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer