బెంగళూరు బ్లాగర్ల మూడో సమావేశం

నవీన్ గారి నుంచి బెంగళూరు బ్లాగర్ల మూడో సమావేశం అంటూ వచ్చిన పిలుపు చూసి ఈసారి ఎలాగైనా వెళ్ళ్ళాలి అనుకున్నాను కానీ నా బద్ధకం సంగతి నాకు బాగా తెలిసి ఉండడం వల్ల నాకే నమ్మకం పూర్తిగా లేదు వెళ్తానని. కానీ నాగరాజు గారు మెయిల్ లో పేక బెత్తాలు, ఆగ్రా కొరడాలు అంటూ చూచాయగా సూచించడంవల్ల, గురువుగారి సంగతి తెలిసిన నేను ఈ సారి వెళ్ళి తీరాలని నిర్ణయించేసుకున్నాను.

అనుకున్న విధంగా మధ్యాహ్నం రెండు గంటలకి జయనగర్ వూడీస్ రెస్టారంట్ దగ్గర నేను, ప్రవీణ్, నవీన్ కలుసుకున్నాం. ప్రదీపు గారు రావలసి ఉంది కానీ చివరినిముషంలో ఆయన మానుకోవలసివచ్చిందని ప్రవీణ్ చెప్పారు. ముగ్గురం కలిసి బెంగళూరు మహానగర సారిగ సంస్థ వారి వాహనాన్ని నమ్ముకుని నాగరాజు గారి ఇంటికి ప్రయాణమయ్యాం.

నాగరాజు గారి ఇంటి సమీపానికి వెళ్ళేప్పటికి మూడు గంటలు దాటింది. ఆయనకి కాల్చేసేప్పటికి ఆయనే మాకు ఎదురొచ్చారు. ఇంట్లోకి ఆహ్వానించి రెండవ అంతస్తులోని ఆయన కార్యాలయంలోకి తీసుకెళ్ళారు. కొద్ది నిముషాల పాటు మేము ముగ్గురం ఆయన దగ్గరున్న పుస్తక సంపదకి హాశ్చర్యపోయి మాటరాక వాటిని చూస్తూ ఉండిపోయాము.

కొద్దిగా తేరుకున్నాక మాటలు మొదలయ్యాయి. మొదటగా మనదేశంలో ప్రస్తుతం జరుగుతున్న పట్టణీకరణ - దాని వల్ల సమస్యలు, వాహనాల రద్దీ,కాలుష్యం ఇలాంటి విషయాలమీద సార్క్ శిఖరాగ్ర సమావేశాల స్థాయిలో ఎవరి అమూల్యమైన అభిప్రాయాలని వాళ్ళు వ్యక్తపరిచారు అందరూ. ఇక తర్వాత చర్చ నెమ్మదిగా కంప్యూటర్/అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి వైపుకి మళ్ళింది. నవీన్ గారు తెలుగు ఓసీఆర్ (ఆప్టికల్ కేరక్టర్ రికగ్నిషన్) గురించి ప్రస్తావించగా నాగరాజు గారు దాని కంటె ఇమేజ్ క్లీన్సింగ్, ఇమేజ్ మేచింగ్ వంటి పద్ధతులు ఎక్కువ సులభమని అభిప్రాయ పడ్డారు. ఇంతలో నాగరాజు గారి శ్రీమతి(పద్మగారు) వచ్చి పలకరించారు. ఆవిడతో పాటు టీలూ సమోసాలూ కూడా. ఆవిడ మంచి గాయని అన్న విషయం తెలిసింది మాకు.

ఆ తర్వాత మా కబుర్లు అలా సాగుతూనే ఉన్నాయి.నాగరాజు గారు సమయాన్ని సద్వినియోగ పరచుకోవడం గురించీ, కొన్ని మంచి పుస్తకాల గురించీ తెలియచేసారు. అలాగే భారతీయ శాస్త్రీయ సంగీతం గురించీ, దానినుండి మనం నేర్చుకోవల్సిన సమస్యల పరిష్కరణా విధానాన్ని గురించీ ప్రసంగించారు.

చీకటిపడుతుండడంతో మేము బయల్దేరదామని లేచాము.కిందికిదిగగానే ఈసారి బ్లాగర్ల సమావేశంలోని అతి ముఖ్యమైన సంఘటన జరిగింది. పద్మగారు అప్పుడే వండిన వేడి వేడి ఆవుపాల జున్ను మా అందరికీ వడ్డించారు. అది ఒక పట్టు పట్టి, గోమాతకీ నాగరాజు గారి ఇంటి అన్నపూర్ణకీ మా కృతజ్ఞతలు తెల్పుకుని ఎవరి ఇళ్ళకి వాళ్ళం బయల్దేరాము.

ఈ నెల సమావేశంలో చర్చించిన మరికొన్ని అంశాలు:

- సామాన్యుడికి కంప్యూటింగు అవసరం ఏమిటో, దానికి భారతీయ భాష ఇంటర్ఫేస్ ఎలా తోడ్పాటుపడుతుందో అన్న దిశలో పని ప్రారంభించడం.
- దీనికోసం వీలైతే కన్నడబ్లాగర్లని కూడా కలుపుకోడం. వచ్చేసారి బెంగళూరులో జరిగే బార్ కేంప్లో ఈ విషయాన్ని చర్చించడానికి ప్రయత్నం చెయ్యడం.
- గృహిణులకు అంతర్జాలం,బ్లాగింగ్లపై అవగాహన కల్పించడం. దానివల్ల కుటుంబ సంబంధాలు ఎలా మెరుగుపడతాయో సూచించడం.
- కార్పొరేట్లకీ ఇతర స్వచ్చంద సంస్థలకీ ఈ కార్యక్రమాల గురించి పరిచయం చేసి వారి సహాయాన్ని పొందడం.

~ శ్రీరామ్ @ sreekaaram.wordpress.com

కన్నడబ్లా

కన్నడబ్లాగర్లను కలుపుకొనే విషయాన్ని గతంలో ఒకసారి మన గుంపులో ప్రస్తావిద్దామనుకొన్నానుగానీ, మొహమాటపడ్డాను. ఇప్పుడు బలపరుస్తున్నాను. కన్నడిగులు మనకంటే ఎక్కువగా మాతృభాషను వారి దైనందిన వ్యవహారాల్లో ఉపయోగిస్తారు. ఆంధ్రులతో పోల్చిచూస్తే కన్నడిగులు మాతృభాషలోనే ఎక్కువగా సాకేతిక పదాలు వాడుతున్నారు. వాళ్లతో స్నేహంవలన మన మాతృభాషల్లో సాంకేతికపదాల సృష్టిలో చాలా సహాయం జరుగుతుందని నా నమ్మకం. ఒక చిన్న ఉదాహరణ:

మీరు కాల్చేస్తున్న సబ్స్క్రైబర్ .... కాసేపాగి డయల్ చేయండి -- ఇలా ఉంటుంది తెలుగులోని ఫోను సందేశం.
నీవు కరియమాడువ చందాదారరు .... స్వల్ప సమయదనంతర ప్రయత్నిసి -- ఇది కన్నడిగుల ఫోను సందేశం.

ప్రతిచోటా ఒక ఉద్యమంలాగా వారు పూనుకొని కన్నడభాషను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా విద్యావంతులు. మనవాళ్లలో ఇంగ్లీషుపదాలు వాడటమే నాగరీకం అనే వేలంవెర్రి మరింతగా తగ్గవలసి ఉంది.

-- రానారె [ http://yarnar.blogspot.com http://mynoice.blogspot.com ]

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer