23వ హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో e-తెలుగు కార్యక్రమాల నివేదిక (డిసెంబరు 18-28, 2008)

అంతర్జాలంలో తెలుగును వ్యాప్తి చేసే క్రమంలో 23వ హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో e-తెలుగు ఒక స్టాలు తీసికొని నిర్వహించింది. e-తెలుగు నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో కెల్లా ఇదే పెద్దది. హైదరాబాదులో ఉన్న e-తెలుగు సభ్యులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న సభ్యులు కూడా తగు సూచనలు సలహాలనిస్తూ పరోక్షంగా పాల్గొన్నారు.

బ్లాగు దినోత్సవం సందర్భంగా 2008 డిసెంబరు 14న హైదరాబాదులో జరిగిన e-తెలుగు సమావేశంలో తెలుగు వ్యాప్తి విషయమై విస్తృతమైన చర్చ జరిగింది. పుస్తక ప్రదర్శన వంటి సామూహిక కార్యక్రమాల్లో e-తెలుగు ప్రచారోద్యమాన్ని చేపట్టాలని సభ్యులు భావించారు. 23వ హై. పుస్తక ప్రదర్శన మరో నాలుగు రోజుల్లో జరుగనున్నది కాబట్టి, అక్కడ e-తెలుగు ప్రచార కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం. ఇదీ ఈ కార్యక్రమానికి నేపథ్యం.

అయితే తొలుతగా అనుకున్నది కొన్ని బ్యానర్లు కట్టాలని, కరపత్రాలు పంచాలని., వీలైతే ఒకరోజు సాయంత్రం e-తెలుగు గురించిన ప్రదర్శన ఇవ్వాలని. ఈ విషయమై ప్రదర్శన నిర్వాహకులను సంప్రదించే పనిని కొందరు సభ్యులు భుజాన వేసుకుని, డిసెంబరు 20 వ తేదీ, శనివారం నాడు e-తెలుగు కార్యక్రమాలపై ఒక ప్రదర్శన ఇచ్చేందుకు నిర్వాహకుల వద్ద అనుమతి తీసుకున్నారు.

అయితే 18వ తేదీన - పుస్తక ప్రదర్శన మొదలయ్యే రోజున ఏకంగా ఒక స్టాలునే కేటాయించవల్సినదిగా నిర్వాహకులను కోరాలని నిర్ణయించాం. స్టాలుకు 13 వేలు చెల్లించాలి. కానీ e-తెలుగుకు అంత తాహతు లేదు. అంచేత ఉచితంగా కేటాయించమని అడిగాం. అందుకు ప్రతిగా వారికి ఒక వెబ్‌సైటును తయారుచేసి పెడతాం అని చెప్పగా, వెంటనే అంగీకరించి, ఉచితంగా ఒక స్టాలును కేటాయించారు. ఈ విషయంలో చొరవ తీసికొన్న పుస్తక ప్రదర్శన సంఘం అధ్యక్షుడు ఎస్. శ్రీనివాసరావు గారికి e-తెలుగు నెనరులు తెలియజేస్తోంది.

వెంటనే స్టాలు నిర్వహణ ఏర్పాట్లు చేసాం. కరపత్రాలు, బ్యానర్లు, సభ్యులకు బ్యాడ్జీలు, స్టాలులోకి అవసరమైన స్టేషనరీ వస్తువులు, ప్రదర్శన కోసం అవసరమైన వీడియోలు, ఇతర సాఫ్టువేర్లు తయారుచేసాం. 19 వ తేదీనాటికి 90 శాతం సామాగ్రి సిద్ధం కాగా, మిగతావి 20 వ తేదీకి సిద్ధమయ్యాయి.

పది రోజుల పుస్తక ప్రదర్శనలో కొన్ని విశేషాలు:

 • కంప్యూటర్లో తెలుగు గురించి, అంతర్జాలంలో తెలుగు గురించి అనేకమందికి సందర్శకులకు వివరించాం. చాలామంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకున్నారు.
 • తెలుగు టైపు చెయ్యడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొంతమంది తగు పరిష్కార సూచనలను పొందారు.
 • ఒక తెలుగు ఉపాధ్యాయురాలు తాను పవరుపాయింటు ప్రెజెంటేషనులో తెలుగును చూపించడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందిని వివరించగా ఆమెకు తగు పరిష్కారాన్ని సూచించాం.
 • e-తెలుగుకు ఉచితంగా స్టాలు కేటాయించడంలో ఒక ముఖ్య కారణం మనం చేస్తున్న సేవా కార్యక్రమాలని నిర్వాహకులు చెప్పారు.
 • రెయిన్‌బో ఎఫ్ఎమ్ లో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఒక డీటీపీ ఆపరేటరు కీబోర్డుకు సంబంధించిన తన సందేహాన్ని నివృత్తి చేసుకున్నారు.
 • వివిధ రకాల కీబోర్డులను వాడుతూండే వారు అవే కీబోర్డులతో యూనికోడులో కూడా తెలుగు టైపు చెయ్యవచ్చని తెలుసుకొన్నారు.
 • అనేకమందికి వచ్చిన సందేహం.. "ఈ తెలుగు సాఫ్టువేర్లను కొనుక్కోవాల్సి ఉంటుందా" అనేది. ఈ సాఫ్టువేర్లన్నీ ఉచితమే అని చెప్పినపుడు ఆశ్చర్యానందాన్ని తెలియజేసారు.
 • ఒక సందర్శకుడు e-తెలుగు చేపట్టిన కార్యక్రమాలకు సంతోషపడి, వెంటనే 500 రూపాయలిచ్చి సభ్యత్వం తీసుకున్నారు.
 • లేఖినిలో తెలుగును టైపు చేసే విధానాన్ని ప్రత్యక్షంగా చూసి అనేకమంది సందర్శకులు తెలుసుకొన్నారు.
 • కేంద్ర మానవవనరుల శాఖ సహాయమంత్రి మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి, సినారె, ఎ.బి.కె.ప్రసాదు, సి.మృణాళిని, బి.వి.రాఘవులు, కె.నాగేశ్వర్, చుక్కా రామయ్య, బి.వి.పట్టాభిరామ్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎ.జి.కృష్ణమూర్తి, అప్పారావు, బాలి, భారవి వంటి ప్రముఖులు మన కృషి గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు.

ప్రసార మాధ్యమాల వారు ముందుకువచ్చి e-తెలుగు కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరచి వార్తలను, వార్తాకథనాలను ప్రచురించారు/ప్రసారం చేసారు. ఆ వివరాలు:

 • దక్కన్ క్రానికల్ లో వార్తాకథనం వచ్చింది.
 • హిందూ పత్రికలో వార్తా కథనం వచ్చింది.
 • టీవీ5 వారు వార్తా కథనాన్ని ప్రసారం చేసారు.
 • టీవీ9 వారు e-తెలుగు ప్రదర్శన గురించి వార్తను ప్రసారం చేసారు
 • రెయిన్‌బో ఎఫ్ఎమ్ వారు e-తెలుగు సభ్యులతో ఒక గంట ముఖాముఖీ నిర్వహించారు
 • ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, సాక్షి పత్రికల్లో e-తెలుగు కార్యక్రమాలకు సంబంధించిన వార్తలు వచ్చాయి.

డిసెంబరు 18, మొదటి రోజు
అక్కడే ఉన్న టీవీ9 కు చెందిన రవి ప్రకాష్ గారిని కలిసి బ్లాగుల గురించి, e-తెలుగు కార్యక్రమాల గురించి వివరించాం.

డిసెంబరు 19, రెండోరోజు
స్టాలు సిద్ధమైంది. ఈనాడు, టీవీ9 వారి స్టాళ్ళ మధ్యన e-తెలుగు స్టాలు! రెండూ టేబుళ్ళు, రెండు కుర్చీలు రెండు ర్యాకులు నిర్వాహకులు ఇచ్చారు. స్టాలులోకి అవసరమైన ప్రచార సామాగ్రి - వీడియోలు, స్లైడుషోలు, లేఖిని, కరపత్రాలు, బ్యాడ్జీలు, స్టేషనరీ, సందర్శకుల వద్ద డేటా తీసుకునే ఫారాలు వగైరాలను మనం సిద్ధం చేసుకున్నాం. బ్యానర్లు సిద్ధం కాకపోవడాన, ఒక్కటే పెట్టాం. 20 వతేదీ ప్రదర్శన గురించి పత్రికలకు ప్రెస్‌నోట్లు ఇచ్చాం.

డిసెంబరు 20, శనివారం - మూడోరోజు
కొత్తగా మరో మూడు బ్యానర్లను పెట్టాం. వేదికపై ఇచ్చే ప్రదర్శన కోసం వీడియో వగైరాలు సిద్ధమయ్యాయి. ఎవరెవరు ఏమేం మాట్లాడాలో నిశ్చయించుకున్నాం. ప్రదర్శనను నాలుగు ప్రధాన భాగాలుగా విభజించాం.

 1. e-తెలుగు గురించి పరిచయం
 2. కంప్యూటర్లో తెలుగు కోసం సిద్ధపరచే విధానం, తెలుగులో రాసేందుకు అవసరమైన సాఫ్టువేర్ల గురించి, తెలుగీకరణం గురించీ పరిచయం
 3. బ్లాగుల గురించి, సంకలినుల గురించి పరిచయం
 4. వికీపీడియా, ఇతర తెలుగు వెబ్‌సైట్ల గురించి పరిచయం

సభ్యుల ప్రసంగాలు, సంబంధిత వీడియోలతో కలగలిపి ఈ ప్రదర్శనను నిర్వహించాం. ప్రదర్శనకు అవసరమైన ప్రొజెక్టరును సాయిరామ్ గారు ఉచితంగా ఇచ్చారు. తెరను అద్దెకు తీసికొన్నాం. పుస్తక ప్రదర్శన వారి వెబ్‌సైటు ఆవిష్కరణ రోజున కూడా సాయిరామ్ గారు ప్రొజెక్టరును ఉచితంగా అందించారు. వారికి e-తెలుగు నెనరులు తెలియజేస్తోంది. ప్రముఖ రచయిత భారవి గారు, ప్రముఖ మెజీషియన్ పట్టాభిరాం గారు ఈ రోజు స్టాలును సందర్శించిన ప్రముఖులు.

డిసెంబరు 22, సోమవారం - ఐదోరోజు
రెయిన్‌బో ఎఫ్ఎమ్ నుండి ఆకాశవాణి ప్రోగ్రాం డైరెక్టరు గారు, ప్రోగ్రాం ఇన్‌చార్జిలు వచ్చారు. త్వరలో ఓ ప్రోగ్రాం చేద్దాం అన్నారు. కాంగ్రెస్ నేత పాలడుగు వెంకట్రావు గారు కూడా స్టాలును సందర్శించారు. ప్రముఖ రచయిత సి. నరసింహారావు గారు కూడా స్టాలును సందర్శించారు. టీవీ 5 విలేకరి e-తెలుగు కార్యకలాపాల గురించి తెలుసుకున్నారు. అదే సమయంలో ఈటీవీ2 వాళ్లూ వచ్చి వివరాలు తీసుకున్నారు.

డిసెంబరు 23, మంగళవారం - ఆరోరోజు
ప్రముఖ రచయిత్రి సి.మృణాళిని గారు స్టాలును సందర్శించారు. ఆమె తెలుగుపై వీడియోను ఆసక్తిగా చూశారు. ఆమె ఇప్పటికే తెలుగులో టైప్ చెయ్యడానికి లేఖిని వాడుతున్నానని చెప్పారు. కానీ కాపీ పేస్ట్ చెయ్యడం విషయమై అసౌక్యరంగా ఉంది, నేరుగా టైప్ చేసుకునే మార్గం లేదా అని అడిగారు. అప్పటికప్పుడు లాప్ టాప్ లో బరహతో నేరుగా బ్రౌసెర్లోనూ, వొర్ద్లోనూ టైప్ చేసి చూపించాం. అలాగే అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి గురించి మనమందరం చేస్తున్న కార్యకలాపాల గురించి ఓసారి వివరంగా చర్చించడానికి మృణాళిని గారి అపాయింట్ మెంట్ కోరగా ఆమె అంగీకరించారు.

డిసెంబరు 24, బుధవారం - ఏడోరోజు
హైదరాబాద్ పుస్తక ప్రదర్శన కోసం రూపొందించదలచిన వెబ్‌సైటు http://www.hyderabadbookfair.com ను సిద్ధపరచాం. ఈ సైటును శాసనమండలి సభ్యులు కె.నాగేశ్వర్ గారి చేతుల మీదుగా ప్రారంభం చేయించారు. ఈ ప్రారంభోత్సవానికి అవసరమైన ప్రొజెక్టరు, తెర వగైరాలను e-తెలుగు సమకూర్చింది. 93.5 SFM వారు ఎగ్జిబిషన్ ఆవరణ నుండి చేసిన లైవ్ ప్రోగ్రాములో e-తెలుగు గురించి ఓ 3 నిముషాల పాటు సభ్యుల చేత వివరింపజేసారు.

డిసెంబరు 25, గురువారం - ఎనిమిదోరోజు
క్రిస్ట్‌మస్ రోజు. తెలుగు బ్లాగరులు చాలామంది ఆ రోజున స్టాలును సందర్శించారు. సినిమా దర్శకుడు దేవీ ప్రసాద్ గారు స్టాలును సందర్శించారు. బి.వి.పట్టాభిరామ్, శాసనమండలి సభ్యులు చుక్కా రామయ్య గారలు స్టాలును సందర్శించారు. రామయ్య గారు అంతర్జాలంలో తెలుగు విషయాన్ని శాసనమండలిలో ఓసారి చర్చకు తెద్దాం అని మాట ఇచ్చారు. ఓసారి ఆయన్ని కలిసి మరింత వివరంగా దీనిపై చర్చించవలసి ఉంది.

డిసెంబరు 26, శుక్రవారం - తొమ్మిదోరోజు
ఈరోజు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారినీ, అధికార భాషా సంఘం అధ్యక్షులు ఎ.బి.కె. ప్రసాద్ గారినీ, విశ్రాంత IPS అధికారి అప్పారావు గారిని, ముద్ర కమ్యూనికేషన్స్ అధినేత ఎ.జి. కృష్ణమూర్తి గారిని కలిసి e-తెలుగు కార్యకలాపాల గురించి క్లుప్తంగా వివరించాం.

డిసెంబరు 27, శనివారం - పదోరోజు
ఈరోజు 1.30 ఆకాశవాణి రెయిన్‌బో ఎప్ఫెమ్ లో మన e-తెలుగు గురించి ఒక గంట కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమం విన్నవారొకరు సాయంత్రం స్టాలును సందర్శించారు.

డిసెంబరు 28, ఆదివారం - పదకొండోరోజు
సిపియం కార్యదర్శి బి.వి. రాఘవులు గారు e-తెలుగు స్టాలు వద్దకు వచ్చి మన కార్యకలాపాల గురించి తెలుసుకున్నారు. అలాగే స్త్రీల హక్కుల ఉద్యమ నేత సంధ్య గారు కూడా స్టాలును సందర్శించారు. ప్రదర్శన నిర్వాహకులు కేంద్రమంత్రి పురంధరేశ్వరి గారినీ, రాఘవులు గారినీ అతిధులుగా ఆహ్వానించి పుస్తక ప్రదర్శన ముగింపు సభ జరిపారు. e-తెలుగు గతంలో ముద్రించిన పుస్తకాన్ని మంత్రిగారికి అందజేసాం. అలాగే సినారె గారికి కూడా పుస్తకాన్ని అందజేసాం.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పాత్రికేయులతో సంప్రదిస్తూ మన కార్యక్రమానికి తగు ప్రచారం కలిగించినవారు, స్టాలు కోసం తెరవెనక కృషి చేసి, పని సానుకూలపరచినవారు, రేయింబవళ్ళు కూచుని వీడియోలు, ప్రెజెంటేషన్లు తయారుచేసినవారు, ఠంచనుగా రోజూ స్టాలుకొచ్చి గంటల తరబడి నిలబడి, విసుక్కోకుండా వచ్చినవారితో మాట్లాడి పంపినవారు, ఓపిగ్గా లేఖినిని ఎలా వాడాలో ప్రత్యక్షంగా చూపించినవారు, పత్రికాఫీసులకెళ్ళి ప్రెస్‌నోట్లిచ్చినవారు, బ్యానర్లు కట్టినవారు, బ్యానర్లు కుట్టినవారు, ప్రజెంటేషన్లు ఇచ్చినవారు, సూచనలు సలహాలూ ఇచ్చినవాళ్ళు, స్టాలును సందర్శించి e-తెలుగు కార్యకర్తలను ఉత్తేజపరచినవారు,.. ఎందరో తెలుగు భాషాభిమానులు -అందరి సమష్టి కృషి కారణంగా మన ఈ ప్రయత్నం జయప్రదమైంది.

చదువరి గారు, మొత్తం నివేదికను

చదువరి గారు, మొత్తం నివేదికను చాలా ప్రొఫెషనల్ గా అందించారు. చాలా బాగుంది. ధన్యవాదాలు.
- నల్లమోతు శ్రీధర్

చదువరి గారు అన్ని విషయాలు ఒకే

చదువరి గారు అన్ని విషయాలు ఒకే టపాలో కుదించి అందించినందుకు ధన్యవాదాలు

మీ వివరణ చాల బాగుంది.

మీ వివరణ చాల బాగుంది. హైదరాబాదులో లేని నా లాంటి వాళ్లకు జరిగిన సంఘటనలను కళ్లకు కట్టించారు.
-- మాకినేని ప్రదీపు

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer