తెలుగు బ్లాగుల దినోత్సవ ప్రత్యేక సమావేశపు నివేదిక — హైదరాబాద్

తెలుగు బ్లాగుల దినోత్సవ హైదరాబాద్ సమావేశపు నివేదిక


e-తెలుగు బ్యానరుతో బ్లాగర్లులు

డిసెంబరు 14 ఆదివారం నాడు తెలుగు బ్లాగరుల విశిష్ట సమావేశం జరిగింది. మొదటి తెలుగు బ్లాగు దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ సమావేశానికి 27 మంది వచ్చారు. ఇప్పటివరకు జరిగిన సమావేశాలన్నిటిలోకి అత్యధికంగా హాజరైన సమావేశమిది.

ఎవరెవరొచ్చారు:

 1. అశోక్ వర్మ (అయస్కాంతం)
 2. కత్తి మహేష్ కుమార్ (పర్ణశాల)
 3. కృష్ణ (పండుగాడు)
 4. నందగిరి ప్రవీణ్ కుమార్ (భాగ్యనగరం)
 5. దూర్వాసుల పద్మనాభం (తెలుగుగ్రీటింగ్స్)
 6. కృపాల్ కశ్యప్ (చెప్పాలనివుంది)
 7. ఉప్పల వెంకట రమణ
 8. దాట్ల శ్రీనివాసరాజు (హరివిల్లు)
 9. ఎల్లారెడ్డి (సమతలం)
 10. సీతారాంరెడ్డి (సాగర మధనం)
 11. అట్లూరి అనిల్
 12. పప్పు అరుణ (అరుణమ్)
 13. వరూధిని (సరిగమలు)
 14. వలబోజు జ్యోతి
 15. పి. శ్రీ మహా లక్ష్మి దంపతులు (యాత్ర)
 16. రవి కుమార్
 17. కట్టా విజయ్ (జాబిల్లి)
 18. నల్లమోతు శ్రీధర్
 19. తుమ్మల శిరీష్ కుమార్ (చదువరి)
 20. జాన్ హైడ్ కనుమూరి
 21. తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం (కలగూరగంప)
 22. వీవెన్
 23. శ్రీనివాస కుమార్ (జీవితంలో కొత్త కోణం)
 24. నామాల నాగ మురళీధర్ (మురళీగానం)
 25. సైకం రాజు
 26. చక్రవర్తి (భవదీయుడు)
 27. ఈనాడు మరియు ఆంధ్రజ్యోతి విలేఖరులు

బ్లాగరులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ సమావేశంలో బ్లాగులను వ్యాప్తి చెయ్యడం ఎలా అనే అంశాన్ని ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా బ్లాగావరణం బయటివారికి బ్లాగుల గురించి తెలిపేదెలా? బ్లాగు సందర్శకుల సంఖ్య పెంచేదెలా? అనే అంశంపై చర్చ సాగింది. ఈ సందర్భంగా అరిపిరాల సత్యప్రసాద్ బ్లాగుల వ్యాప్తికి సంబంధించి గుంపుకు రాసిన సూచనలను కూడా చర్చించారు.

చాలామందికి కంప్యూటర్లలో తెలుగు చూడవచ్చని ఇంకా తెలియదు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి:

 • ఇంట్లో కంప్యూటర్లున్న వారు తక్కువే. అందునా అంతర్జాల సంధానం ఉన్నవారు మరీ తక్కువ. నగరాలలో పరిస్థితి మెరుగవుతున్నా, చిన్న పట్టణాలు మరియు గ్రామాల్లో అంత చొరబాటు లేదు.
 • ముఖ్యంగా జాల కేంద్రాలలో చాలా మట్టుకు పురాతన కంప్యూటర్లు, వాటిలోని విహారిణులు పాతవి కావడం వల్ల వాటిలో యూనికోడుకి తోడ్పాటు ఉండటంలేదు. డబ్బాలు లేదా అర్థంకాని చెత్త అక్షరాలు తప్ప తెలుగు కనబడటం లేదు.
 • సాధారణంగా తెలుగుకి తగ్గిన ఆదరణ కూడా ఓ కారణం.

దీనికి కొన్ని పరిష్కారాలను సూచించారు:

 • కంప్యూటరులో తెలుగు స్థాపించుకోవడం ఎలా అనే అంశంతో కరపత్రాలను తయారు చేసి, జాలకేంద్రాల వారికి పంచడం.
 • ఈనాడు మరియు ఆంధ్రజ్యోతి పత్రికలలో వారం వారం వస్తున్న బ్లాగు పరిచయాలు
 • మనం పంపే మెయిళ్ళలో సంతకాలుగా బ్లాగు చిరునామానో, లేదా మీ అభిమాన సంకలిని చిరునామానో ఇవ్వడం
 • పుస్తక ప్రదర్శనలు, లేదా ఇతరత్రా సమావేశాలప్పుడు అక్కడ కరపత్రాలు పంచడం డిసెంబరు 18 నుండి హైదరాబాదులో జరగబోయే పుస్తక ప్రదర్శనలోను, జనవరిలో విజయవాడలో జరగబోయే పుస్తక ప్రదర్శనలోను కరపత్రాలు పంచాలని నిర్ణయించారు. అలాగే రెండు బ్యానర్లను కూడా ప్రదర్శన స్థలంలో ఉంచే ఏర్పాటు చేస్తారు. ఈ పుస్తక ప్రదర్శనల్లో వీలైతే ఒక సాయంత్రం బ్లాగుల గురించి ఒక ఉపన్యాసం కూడా ఇవ్వాలని నిర్ణయించారు. పప్పు అరుణ ఈ విషయమై ప్రదర్శన నిర్వాహకులను సంప్రదిస్తారు. నల్లమోతు శ్రీధర్ కంప్యూటర్ఎరా వారి స్టాలులో మన కరపత్రాలను ఉంచే వీలు కల్పిస్తారు. శిరీష్ కుమార్ కరపత్రాలను, బ్యానరులను 18 వ తేదీ ఉదయానికల్లా సిద్ధం చేసి, శ్రీధర్‌కు అందిస్తారు.

బ్లాగులు మొదలుపెట్టి ఆపేస్తున్నవారి గురించి, ఆపివేయడానకి కారణాలేమయి ఉంటాయోనని ఆలోచించారు. కొంతమంది బ్లాగర్.కామ్ లోని సౌలభ్యాలని తెలుసుకోవడం కష్టంగా అనిపించి, మరికొంత మంది వ్యాఖ్యల రూపంలో విమర్శలను, తిట్లను తట్టుకోలేక, ఇలా చాలా కారణాలే ఉండొచ్చనుకున్నాం.

బ్లాగు నిర్వహణలో సమస్యలకి, సాంకేతిక సహాయం కావల్సిన వాళ్ళకి తగిన సూచలని, సమాచారాన్ని క్రోడీకరించాలనుకున్నారు. బ్లాగరులోను, వర్డ్‌ప్రెస్సులోను బ్లాగులను ఎలా నిర్వహించుకోవాలో వివరంగా ఒకచోట రాయాలని అన్నారు. తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం బ్లాగర్.కామ్ లో బ్లాగు నిర్వహణకు సంబంధించి ఒక పుస్తకం రాస్తున్నానని చెప్పారు. బ్లాగు నిర్వహణపై వీడియోలు తయారు చేస్తున్నట్టుగా నల్లమోతు శ్రీధర్ చెప్పారు.

బ్లాగు సమావేశాల గురించి పత్రికల్లోనేగాక, స్థానిక టీవీలో కూడా ప్రసారం చేసే ప్రయత్నం చెయ్యవచ్చు. ఈ విషయమై కృపాల్ కశ్యప్ ప్రయత్నం చేస్తానని చెప్పారు. సమావేశం ముగించి ఇంటికి వెళ్ళగానే నామాల మురళీధర్ ఈ విషయమై కేబుల్ టీవీ వాళ్ళతో సంప్రదించి ఈ విషయం పట్ల వాళ్ళ సానుకూల స్పందనను పొందారు. త్వరలో ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది.

మన పరిచయస్తులైన తెలుగువారందరికీ తెలుగు బ్లాగుల గురించి ఈమెయిళ్ళు పంపాలని, ఈ ఉత్తరం తెలుగు, ఇంగ్లీషు రెంటిలోను ఉండాలని అన్నారు. వివిధ సాంకేతిక, అసాంకేతిక అంశాలపై సహాయానికి సంబంధించిన లింకులను కూడలిలోనే ఇచ్చి ఆ లింకును ఈ ఉత్తరాల్లో ఇస్తే అందరికీ వీలుగా ఉంటుందని ఈ సందర్భంగా అట్లూరి అనిల్ అన్నారు బ్లాగరులంతా తమ ఈమెయిలు సంతకంగా కూడలి.ఆర్గ్ ను ఇస్తే బాగా ప్రచారం జరుగుతుంది అని అన్నారు. జాలం బయట రచయితలను జాలంలో రచనలు చేసేట్లుగా ప్రోత్సహించాలన్న అంశంపై చర్చిస్తూ అది సాధ్యమయ్యే పని కాదని తేల్చారు.

డా.ఇస్మాయిల్ 'కూడలి బడి' ఆలోచన గురించి అనుకున్నప్పటికీ పూర్తిగా చర్చించలేదు.

తెలుగు నిలుపుట గురించి ఇతెలుగు.ఆర్గ్‌లో జరిగిన చర్చపై కూడా సమావేశం చర్చించింది. ముందుగా "తెలుగెందుకు" అనే విషయంపై చర్చ జరిగింది.

 • రోజువారీ అవసరాల్లో తెలుగు అవసరం లేకపోవడం తెలుగు వెనకబడిపోవడానికి ఒక కారణం.
 • తెలుగు బోధన లోపభూయిష్టంగా ఉంది.. అసలు మనలో తెలుగుతనం చాలా తక్కువగా ఉంది.
 • ప్రస్తుతం ప్రధానంగా తెలుగు అవసరం వార్తా పత్రికలు చదివేందుకు ఉంది.
 • కొన్ని పార్టీలు ప్రకటించిన గ్రామ స్వపరిపాలన వస్తే తెలుగు పరిపాలనలో తెలుగు తప్పనిసరి అవుతుంది.
 • తెలుగులో రాస్తే వచ్చే గుర్తింపు ఇంగ్లీషులో రాస్తే రాదు అని అన్నారు. ఇంగ్లీషులో రాసినప్పటికీ వాటిని ఆయా భాషా
 • తెలుగువారనే ప్రత్యేక గుర్తింపునిస్తుంది కాబట్టి తెలుగు కావాలి.
 • సంస్కృతికి భాషే మూలం, భాషే లేకపోతే సంస్కృతి ఉండదు. మన సంస్కృతి, వారసత్వాలను కాపాడుకోవాలంటే భాష ఉండాలి.

సాధారణ వ్యవహారంలో తెలుగుని నిలపడం గురించి:

 • ప్రజలందరి చిత్తశుద్ధీ చాలా అవసరం దానికి ప్రభుత్వపు తోడ్పాటు తోడవ్వాలి. తెలుగు అమలుకై ప్రభుత్వపు ఉత్తర్వులని ప్రభుత్వ కార్యాలయాలే పట్టింకునే పరిస్థితి లేదు. ఈ విషయంపై కర్నూలులో ఓ వ్యక్తి న్యాయ పోరాటం కూడా జరుపుతున్నారన్న కథనం చర్చకు వచ్చింది.
 • టీవీ ఛానెళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనుకుంటూ ఉండగానే, "జీవితంలో కొత్త కోణం" శ్రీనివాస కుమార్ ఓ కొత్త సంగతి చెప్పారు. తమిళనాట ఓ పార్టీకి చెందిన టీవీ ఛానల్ పూర్తిగా తమిళ భాషలోనే ప్రసారాలు నిర్వహిస్తుందంట. ఆంగ్ల పదాలు దొర్లితే, వాఖ్యాతలను మళ్ళీ బడికి పంపిస్తారట. అంతేగాక, ప్రధాన కూడళ్ళలోనూ, జనసమర్దమున్న ప్రదేశాలలోనూ రోజువారీ వాడే ఆంగ్ల పదాలకు తమిళ పదాలను బోర్డుల రూపంలో ప్రదర్శిస్తున్నారట కూడా. ఈ విషయం బ్లాగరులను ఆశ్చర్యపరచింది.
 • 12వ తరగతి వరకూ విద్యా భోదన తెలుగు భాషలోనే జరగాలని కొందరూ, కనీసం ఒక సబ్జెక్టుగా ఉన్నా చాలని మరికొందరూ అభిప్రాయపడ్డారు.
 • పార్టీల ఎన్నికల ప్రణాళికల్లోను, అభ్యర్థుల ప్రచారంలోను దీన్నొక అంశంగా చేర్చాలని కూడా భావించారు.

వలబోజు జ్యోతి పప్పు అరుణ పాత్రికేయులకు పత్రికా సందేశాలు (ప్రెస్‌నోట్లు) ఇచ్చారు. టీ, కాఫీలు సేవించిన తరువాత, సమావేశం ముగిసింది.

సమావేశ చిత్రావళి | సమావేశ కబుర్లు (ఆడియో)

ఈ సందర్భంగా తాడేపల్లిగారు

ఈ సందర్భంగా తాడేపల్లిగారు చెప్పిన స్లోగన్ .అదుర్స్,,,

ఎవరి బ్లాగుకు వారే సుమన్,, వారే దుష్మన్...

మరో గుళిక: స్పందించే స్థాయి

మరో గుళిక:

స్పందించే స్థాయి నుండి అందించే స్థాయికి, అందించే స్థాయి నుండి ఉపదేశించే స్థాయికి ఎదగాలి.

హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో

హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఈ- తెలుగు తెలుగు బ్లాగుల గురించి ప్రచారం చెయ్యడానికి మనకు అనుమతి దొరికింది.
సమయం : శనివారం సాయంత్రం 6- 7
వేదిక :పీపుల్స్ ప్లాజా, నెక్లేస్ రోడ్.
దయచేసి, వీలు చేసుకుని హాజరవుతారని ఆశిస్తున్నాం.

తెలుగు బ్లాగు దినోత్షవం

తెలుగు బ్లాగు దినోత్షవం జరుపుకున్నమని 27 మంది బ్లాగర్లతో సమవేశం జరిగిందని చదివి చాల సంతోషపడ్డాను....మీకు నా అభినందనలు

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer