హైదరాబాదు e-తెలుగు సమావేశం - 2008 మే

e-తెలుగు హైదరాబాదు సమావేశం 2008 మే 11 న హైదరాబాదు కృష్ణకాంత్ పార్కులో జరిగింది. సమావేశం సాయంత్రం 4 గంటల్కు అనుకున్నప్పటికీ 4:20కి మొదలైంది. ఫ్రాన్సులో ఉండే వారణాసి కిరణ్, ఈ సమావేశానికి రావడం ఒక విశేషం.

సమావేశానికి వచ్చిన స్సభ్యులు:
యు.వెంకటరమణ
తుమ్మల శిరీష్ కుమార్
విజయ్ కట్టా
కృపాల్ కశ్యప్
సాయిచరణ్
దూర్వాసుల పద్మనాభం
దాట్ల శ్రీనివాసరాజు
బి.కిరణ్
వీవెన్
భానుప్రసాద్
వారణాసి కిరణ్
చక్రవర్తి
సి.బి.రావు

e-తెలుగు ఒక సంఘంగా నమోదైన తరువాత జరిగిన మొదటి సమావేశంలో చర్చ అంతా e-తెలుగు గురించే జరిగింది.

ముందుగా చదువరి సంఘావిర్భావాన్ని గురించి క్లుప్తంగా వివరించారు. సంఘం చేపట్టవలసిన కార్యక్రమాల గురించి సభ్యులు తమ తమ సూచనలను చెప్పవలసిందిగా ఆయన కోరారు.

పద్మనాభం, చక్రవర్తి, బి.కిరణ్ మొదలైన వారు తమ తమ అభిప్రాయాలను చెబుతూ కింది సూచనలను చేసారు.

1. eతెలుగు గురించిన పూర్తి వివరాలు చాలా మందికి తెలియవు. దాని వెబ్‌సైటులో కూడా సరైన వివరాలు లేవు. సంఘానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తూ వెబ్‌సైటును పునర్వ్యవస్థీకరించాలి.
2. సమావేశాలు పార్కుల్లో కాక, ఏదైనా భవనంలో ఒక సీరియస్ వాతావరణంలో జరగాలి.
3. ఇప్పటివరకు వ్యక్తిగత స్థ్యాయిల్లో, అసంఘటితంగా జరుగుతున్న పనులను సంఘటితం చెయ్యడమెలాగో ఆలోచించాలి.
4. సమాజంలోగానీ, ప్రభుత్వంలో గానీ పెద్దలను ఎవరినైనా కలుస్తున్నపుడు e-తెలుగు సంస్థ తరపునే కలవాలి.
5. తెలుగు నెజ్జనులను సంఘంలో చేరమంటూ ప్రోత్సహించాలి.
6. సంఘంలో సభ్యుల నమోదు చేసుకునేందుకు తగు ప్రవేశపత్రాన్ని తయారు చేసి సంఘపు వెబ్‌సైటులో పెట్టాలి. సభ్యత్వ రుసుము వసూలు చెయ్యాలి.
7. e-తెలుగు చేపట్టదలచిన పనుల విషయమై సంఘ కార్యవర్గ సభ్యులే ముందుకు వచ్చి పనులు మొదలుపెట్టి ఇతర సభ్యులకు స్ఫూర్తినివ్వాలి.
8. సంఘపు చిహ్నం, లెటరుహెడ్లు తయారు చెయ్యాలి.
9. e-తెలుగు టీషర్టులు తయారుచెయ్యాలి.
10. బ్లాగుల్లో e-తెలుగు బొత్తాలు తయారుచేసి పెట్టుకోవాలి. తద్వారా సంఘానికి ప్రచారం కల్పించాలి.

అంతర్జాలంలో తెలుగును వ్యాపింపజేసే విషయంలో ఇప్పటికే అనేక రకాలుగా, వివిధ స్థాయిల్లో పనులు జరుగుతున్నాయి. ఇక ఈ పనులను e-తెలుగు ద్వారా జరిపేందుకు గాను తగు ప్రణాళికలను తయారు చెయ్యాలని చెబుతూ, చదువరి వాటిపై సభ్యుల అభిప్రాయాలను కోరారు:

1. ఫాంట్లు: కొత్త ఫాంట్ల తయారీని e-తెలుగు ప్రోత్సహించాలనే విషయంపై జరిగిన చర్చలో కింది అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

  1. సీ-డాక్ వారు ఫాంట్లు ఇప్పటికే తయారు చేసి ఉన్నారు. కానీ అవి బహుళ ప్రయోజనకరంగా లేవు. వారిని సంప్రదించి తగు ఫాంట్ల తయారీ కోసం కృషిచెయ్యాలి. ముందుగా పెడ్యాల రాంబాబు గారిని సంప్రదించాలి. కశ్యప్, చదువరి ఈ పని చేపడతారు.
  2. వైజాసత్య, చరసాల ప్రసాదు గారలు ఫాంట్ల తయారీ విషయమై ఇప్పటికే చొరవ తీసికొని 10 వేల రూపాయలు, 5 వేల రూపాయల చొప్పున నగదు బహుమతులు ప్రకటించి ఉన్నారు. దానికి స్పందనగా ఫాంట్లు తయారు చేసేందుకు దర్భా అంబరీష్ గారు ముందుకు వచ్చారు. దాని ప్రగతిని సమీక్షించి ఆ పనిని పూర్తయేలా చర్యలు తీసికోవాలి. వీవెన్ ఈ పనిని చేపడతారు.
  3. సి.బి.రావు గారు ఈ పనిలో నిమగ్నమై ఉన్న తన స్నేహితుని సంప్రదిస్తారు.

2. అనువాదాలు: స్థానికీకరణ, యూనికోడీకరణ అనే రెండు ప్రధానమైన తెలుగీకరణ పనులు ఇప్పటికే వీవెన్ చొరవతో జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన వివరాలు, ప్రాజెక్టుల జాబితాతో సహా etelugu.org లో వీవెన్ ఇప్పటికే చేర్చి ఉన్నారు. అయితే ఈ పనిలో చాలా కొద్ది మంది మాత్రమే చురుగ్గా పాల్గొంటున్నారు. సభ్యులంతా ఇతోధికంగా పాల్గొని తెలుగీకరణ పనులను జయప్రదం చెయ్యాలి. ఆయా ప్రాజెక్టుల వివరాలను వీవెన్ తాజాకరించి పర్యవేక్షిస్తారు.

3. నిఘంటువులు, పదకోశాలు: నిఘంటు నిర్మాణమనేది వ్యక్తుల సమూహం చేపడితే చెయ్యవచ్చని వారణాసి కిరణ్ అభిప్రాయపడ్డారు. ఆయన అభిప్రాయాలు ఇవి:

  1. ఒక ఆన్‌లైను నిఘంటువును తయారుచెయ్యాలి. ఆ నిఘంటువులో ఇప్పటికే ఆన్‌లైనులో ఉన్న నిఘంటువులలోని పదాలు, వాటి అర్థాలను చేర్చాలి. ఈ పని ఇప్పటికే విక్షనరీలో జరుగుతూంది.
  2. తరువాత ఒక ప్రామాణిక ఇంగ్లీషు నిఘంటువును తీసికొని దానిలోని పదాలను తీసికొని తెలుగులోకి అనువదించే పని మొదలుపెట్టాలి. ఈ పనిని నేరుగా నిఘంటువులో కాకుండా, దీనికోసం ప్రత్యేకించిన వెబ్‌సైటులో చెయ్యాలి. తెలుగు పదం గుంపులో ఈ పని ఇప్పటికే జరుగుతూంది. సభ్యులు పదాలకు అర్థాలను ఈ సైటులో సూచిస్తారు.
  3. వచ్చిన అనువాదాలపై సభ్యులు తమ తమ అభిప్రాయాలను తెలియజేసే సౌకర్యం ఏర్పాటు చెయ్యాలి.
  4. ఎక్కువమంది సభ్యులు ఆమోదించిన పదాలను ఒక జాబితాగా తయారుచెయ్యాలి. ఈ పదాలను అంతర్జాలంలోనూ, ముద్రణా రంగంలోనూ వ్యాప్తి చేసేందుకు కృషి చెయ్యాలి. ఏదైనా ఒక వెబ్ పత్రికలోనూ, ఒక ముద్రిత పత్రికలోనూ ఆ పదాన్ని వాడినపుడు ఆ పదానికి ప్రామాణికత లభించినట్లుగా భావించాలి. అలా ఆమోదం పొందిన పదాలను ఆన్‌లైను నిఘంటువులో చేర్చాలి.
  5. తెలుగు ఉపాధ్యాయులను ఈ పనిలో పాల్గొనేలా సంఘం చొరవతీసుకుని వారిని సంప్రదించాలి. ఉపాధ్యాయుల సంఘాల ద్వారా వీరిని సంప్రదించడం ఒక మార్గం.
  6. పై విషయాలన్నిటినీ క్రోడీకరిస్తూ వారణాసి కిరణ్ ఒక ప్రణాళికను తయారుచేసి e-తెలుగుకు పంపిస్తారు.
  7. సభ్యులు ఆ ప్రణాళికను చర్చించి, ఒక ఆచరణ ప్రణాళికను రూపొందిస్తారు.

ఈ చర్చలన్నీ జరిగాక, కొన్ని ఇతర విషయాలు కూడా చర్చించుకున్నాక, సభ్యులు సెలవు తీసికొన్నారు.
సమావేశపు ఫోటోలు అందగానే పెడతాం.

వివిధ ఉపకరణాల స్థానికీకరణ వివరాలు ఇక్కడ చూడవచ్చు: wiki.etelugu.org/Localization

-వీ

మిత్రులారా నమస్తే,
నేను ‘ఫర్ణశాల’ అనే బ్లాగు రాయడం ప్రారంభించాను.
ప్రస్తుతానికి భోపాల్ లో ఉంటాను గనక సమావేశాలకు రాలేనుగానీ, ఏదైనా కావలసిన సహాయానికీ ఎప్పుడూ సిద్ధం.
నా బ్లాగు చదివి మీ స్పందన తెలియజేయ గోరుతున్నాను. www.parnashaala.blogspot.com
మహేష్