సెప్టెంబరు నెల eతెలుగు సమావేశ వివరాలు

నేను, వీవెన్, రావుగారు ముందుగా నిర్ణయించుకున్న నెక్లెస్ రోడ్ చేరుకున్నాం. అక్కడ ఈట్‌స్ట్రీట్‌లో అప్పటికే శ్రీధర్ గారు, జ్యోతిగారు, జ్యోతిగారి కుమార్తె దీప్తి వేచి ఉన్నారు. చుట్టు పక్కల జనం, గందరగోళ సంగీతం ఇబ్బంది కలిగిస్తున్నాగాని వానొచ్చే సూచనలు కనిపించడంతో అక్కడే సమావేశం అవుదామని నిర్ణయించుకున్నాం. ఇంతలో సత్యసాయి కొవ్వలి గారు వచ్చారు. కంప్యూటర్‌ఎరా లో వచ్చిన వ్యాసం గురించి కొద్దిసేపు మాట్లాడుకున్నాం. వెంటనే కాకపోయినా కొన్ని రోజుల తర్వాతైనా తప్పకుండా ఫలితం కనిపిస్తుందని అనుకున్నాం. కొంత సేపటికి శ్రీధర్ గారి స్నేహితులు టి.సుధాకర్‌గారు వచ్చారు. ఈయన ఈ సమావేశానికి కొత్త. టి.సుధాకర్ ఈనాడు దినపత్రికలో ప్రత్యేకపేజీల విభాగంలో గ్రాఫిక్‌ డిజైనర్‌. శ్రీధర్ గారు ఈయనికి తెలుగు బ్లాగులు, eతెలుగు సమావేశం గురించి చెప్పడంతో స్వతహాగా సాహిత్యం, తెలుగు భాష మీద ఉన్న మక్కువతో ఈ సమావేశానికి వచ్చారు. ఫొటో బ్లాగు ఒకటి మొదలుపెట్టమని ఆయనను అడిగాము. eతెలుగు సంఘం ముఖ్య ఉద్దేశ్యం వీవెన్ వివరంగా చెప్పారు. మొజిల్లా తదితర ఉపకరణ/సైట్‍ల స్థానికీకరణ, తెలుగు వికీపిడియా గురించి వీవెన్ వివరించారు. మాటల్లో పడి మమ్మల్ని టి.సుధాకర్ గారికి పరిచయం చేసుకోకపోవడం గుర్తుకు వచ్చి ఆ పని పూర్తి చేసాం.

ఇంతలో చావా కిరణ్, కందర్ప కృష్ణమోహన్ వచ్చారు. eతెలుగు సమావేశానికి స్థిరవేదిక ఉంటే బాగుంటుందని చావా అభిప్రాయపడ్డారు. అందరమూ స్వల్పాహారం సేవిస్తుండగా శోధన సుధాకర్ వచ్చారు. వర్షం రాకపోవడం గమనించి దొరల కాఫీ పానం చేసిన తర్వాత జ్యోతిగారికి విడ్కోలు పలికి ఈట్‌స్ట్రీట్ పక్కన ఉన్న పచ్చిక మైదానంవైపు కదిలాము. కొంతసేపు కాపీరైట్ల సంగతి; కూడలి, జల్లెడ గురించి చర్చించుకున్నాము. ముగింపు సమయం కావస్తుంది అంటూ చినుకులు హెచ్చరించాయి. శ్రీధర్ గారు, టి.సుధాకర్ గారు సెలవు తీసుకున్నారు.

వర్షం ముప్పేట దాడి ప్రారంభించింది. మిగిలినవాళ్ళం దగ్గరలో ఉన్న రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాం. అక్కడ దాదాపు గంట గడిపాము. అక్కడ జేపి, టీవీ9, ఇంకా కొన్ని సాంకేతికాంశాలు చర్చించుకున్నాము. ఇంతలో పంజాగుట్ట వంతెన కూలిన వార్త తెలిసింది. రైలు కోసం వేచిఉన్నవాళ్ళు దాన్ని అందుకోలేకపోయారు. ఆకాశమలసిపోయినట్టుగా వాన వెలసిపోవడంతో అందరమూ బయటకు వచ్చాము. మిగిలిన వాళ్లకి శుభరాత్రి పలికి సుధాకర్, నేను తన ద్విచక్ర వాహనంపై ఇంటి ముఖం పట్టాం.

చర్చంచుకున్న సాంకేతికాంశాలు:
* స్కైప్ స్తానికీకరణ eతెలుగు సైట్‌లో పూర్తయ్యింది కానీ దానిని స్కైప్ వాళ్ళ మూసలో పొందుపరచడానికి సుధాకర్‌కి నేను సాయం చేస్తానని చెప్పాను.
* సినిమా విషయాల కోసం (రివ్యూలు గట్రా) ప్రత్యేక సైటు/బ్లాగు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాము.
* రాజకీయ అభిప్రాయాలపై కూడా ఓ బ్లాగు/సైటు ఉంటే బాగుంటుందని సుధాకర్ సూచించాడు.

నా కామెంటు

నా కామెంటు కాదుగాని నా అనుభవం కాస్త పెద్దగానే ఉంది. సో నా బ్లాగుకి రావల్సిందే మరి.
http://vjyothi.wordpress.com

అక్కయ్య

అక్కయ్య అనుభవం క్రిందే నా బాధ కూడా ఉంటుంది...

http://vjyothi.wordpress.com/2007/09/12/%e0%b0%88-%e0%b0%a8%e0%b1%86%e0%... లో

http://www.hydbacheors.wordpress.com

కందర్ప

కందర్ప కృష్ణమోహన్

బాబూ ప్రవీణ్... ఓ ఫోన్ చెయ్యాలి నాన్నా......... కళ్ళు తుడుచుకోవడం తప్పేదికదా.. అఫ్కోర్సు.. వచ్చిఉంటే తల తుడుచుకోవడం తప్పేది కాదనుకో...

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer