హైతెబ్లాస వర్షాకాల సమావేశాలు శుభారంభం

హైదరాబాదు తెలుగు బ్లాగర్ల వర్షాకాల సమావేశాలు ధూమ్ ధామ్ లా కాకపోయినా చల్లని జల్లులతో మొదలయ్యాయి. మొదటి వర్షాకాల సమావేశం సూక్ష మృదులం ఆఫీసు, గచ్చిబౌలిలో గత ఆదివారం మధ్యాహ్నం మూడింటి నుంచి రాత్రి ఏడున్నర వరకూ జరిగింది.

ఈ సారి తెలుగు బ్లాగర్ల సమావేశానికి వరుణుడు కూడా విచ్చేసాడు. కూడలిలో ఆహ్వానం చూసాడేమో ఏమో. చిరుజల్లులు కాసేపు కురిసాక చల్లగా చల్లారాడు. అప్పటికి మూడు గంటలు కావచ్చింది.
నేను కూడా దాదాపు వరుణుడు విచ్చేసిన సమయానికే చేరుకున్నాను. నేను చేరుకున్న సమయానికి అప్పటికే భావన, అక్కిరాజు(భావన నాన్న గారు), చదువరి, వెంకట రమణ కలుసుకుని కిరణ్ చావా ఆఫీసులో కూర్చుని మాట్లాడుతూ వున్నారు. నేను నా స్నేహితుడి (బాల) తో వారిని కలసి బరిష్టా దగ్గరలో కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకున్నాం.

group2
(అక్కిరాజు గారు, భావన, చదువరి గారు, కిరణ్, సుధాకర్, బాలా)

ఆ తరువాత ఒకొక్కరు మమ్మల్ని కాల్ చెయ్యటం మొదలుపెట్టారు. అయితే ఉక్కపోత మొదలవ్వటంతో అక్కడి నుంచి పోయి ఆంఫి గాలి ప్రాంగణంలో కాసేపు కూర్చున్నాం. అప్పటికి వర్షం వెలిసి చల్లగా తయారయింది వాతావరణం. ఇప్పటి వరకూ మొత్తం ప్రపంచమంతా జరిగిన తెలుగు బ్లాగర్ల సమావేశానికి వచ్చిన వారిలో అతి పిన్న వయస్కురాలు చిరంజీవి భావన.

food
(మామిడి పళ్లు, కారప్పూస, అరిసెలు, డోనట్లు)

కిరణ్ చావా సౌజన్యంతో ఒక చిన్న సైజు ఫుడ్ కోర్టు తయారయింది. అమెరికన్ తీపి గారెలు (డోనట్స్), కారప్పూస, అరిసెలు (తీపి బూరెలు), మామిడి పళ్లు ఇలా రకరకాలన్న మాట. కిరణ్, భావనలు ఈలోగా అంతాక్షరి ఆడటం మొదలు పెట్టారు. భావన "పలుకే బంగారమాయెనా" అనే మంచి పాటతో ముద్దు ముద్దుగా మొదలు పెడితే, అక్కిరాజు గారు దానిని "నేను పుట్టాను, దేశం పుట్టింది" అనే గాఠ్ఠి స్వరమున్న పాటతో దానిని కొనసాగించారు.

swati_ramana
(క్రింది నుంచి పైకి : స్వాతి, రమణ, రోహిణికుమార్, చైతన్య)

అది సాగుతుండగానే, స్వాతి (కలహార),రోహిణికుమార్, చైతన్య (జ్యోతి గారి అబ్బాయి),అతని స్నేహితురాలు, కందర్ప కృష్ణమూర్తి గారు వచ్చి కలిసారు. అందరి పరిచయాలు అయ్యాక పొలోమని పోయి ఒక పెద్ద కాన్ఫెరెన్స్ రూమ్ లో కూర్చున్నాం.

ఈలోగా వీవెన్, త్రివిక్రమ్, రావు గారు, చందు,శ్రీనివాస రాజు ఈ బ్లాగర్ల సమావేశపు ముఖ్య అతిధి సురేష్ కొలిచాల గారిని వెంటబెట్టుకుని వచ్చారు. ఇక అందరు వచ్చేసినట్లే అనిపించి సమావేశం మొదలు పెట్టాం. దాదాపు ఇరవై మందికి పైగా వచ్చారు ఈ సమావేశానికి. ఈ రోజు జరిగిన సమావేశంలో ముఖ్య అతిధి సురేశ్ గారు చెప్పిన విషయాలు చాలా అమూల్యమైనవి. చాలా తెలియని విషయాలు తెలిసాయి. ఈ-తెలుగు లోకంలో పేరు కోసం పని చెయ్యని అతిరధ మహారధుల సంగతులు తెలిసాయి.

పరిచయాలు : మొదట రావు గారు మొదలు పెట్టారు.తన దీప్తిధార బ్లాగు గురించి చెప్పారు.

కందర్ప గారు తనకు ఇంటర్నెట్లో "telugu" అని శోధించటం ద్వారా ఈ తెలుగు గుంపుని కనుక్కున్నానని చెప్పారు. తరువాత తన గురించి చెప్పారు.

తరువాత సుధాకర్ స్నేహితుడు (బాల) తను బ్లాగరు కాదని, కూడలి మాత్రం చదువుతానని చెప్పారు.

తరువాత క్రమంలో పరిచయాలు ఈ విధంగా వున్నాయి...

అక్కిరాజు గారు

కట్టా విజయ్ (కిరణ్ స్నేహితులు)

పవన్ కుమార్ నండూరి (కిరణ్ స్నేహితులు)

సుధాకర్ - శోధన బ్లాగు రచయత

వీవెన్ - కూడలి, లేఖిని సృష్టికర్త

తుమ్మల శిరీష్ కుమార్ - చదువరి బ్లాగు రచయత

త్రివిక్రమ్ - అవీ ఇవీ రాస్తారు.

చందు - తెలుగు బ్లాగర్స్.కాం సృష్ట్తికర్త

కశ్యప్ - తన బ్లాగు గురించి చెప్పారు.

సురేష్ కొలిచాల - ఈమాట వ్యవస్థాపకులు- తెలుగులో మొదటి యూనికోడ్, డైనమిక్ ఫాంట్లతో మొదలయిన వెబ్ సైట్ సృష్టికర్త. ఈమాట మొదట తానా వారు కొన్న డైనమిక్ ఫాంట్ తో కేవలం మొజిల్లా కోసం తయారుచేసారు. పోతన ఫాంట్ తయారీదారు దేశికాచారి గారిని ప్రత్యకంగా అభినందించటం జరిగింది. దేశికాచారి గారి డైనమిక్ ఫాంట్ల నుంచి యూనికోడ్ ఫాంట్ల ఆవిర్భావం గురించి సురేష్ గారు వివరించారు.అప్పట్లో సురేష్ గారు ఐ.ఇ తెలుగు ప్లగిన్ రాసారని తెలిసింది అయితే మొజిల్ల్లా ప్లగిన్ పద్మని నాగార్జున వెన్న గారు రాసాక తన ప్లగిన్ను ఇక పొడిగింత ఆపేసారని చెప్పారు.

హరివిల్లు శ్రీనివాసరాజు - వికీపీడియన్, శ్రీ పద్మ, శ్రీలేఖిని సృష్టికర్త.

చైతన్య వలబోజు - మారధాన్ బ్లాగర్ జ్యోతి గారబ్బాయి. చైతన్య మొదట జ్యోతి గారికి కొంచం కంప్యూటర్ నేర్పానని, ఆ తరువాత తనకే కంప్యూటర్ వాడటానికి దొరకటం లేదని చెప్పాడు. సురేష్ గారు చైతన్యను జ్యోతి గారి బ్లాగుల గూర్చి అడిగారు. తను పెద్దగా తెలుగు బ్లాగులు చదవనని అప్పుడప్పుడూ వాళ్లమ్మగారివి చూస్తానని అతను చెప్పాడు. సురేష్ గారు చైతన్య లాంటి వారు ఈ తరంలో ఒక ఉదాహరణ లాంటి వారని, ఇంట్లో ప్రముఖ బ్లాగరున్నా తెలుగు చదివే శాతం తక్కువగా ఈనాటి యువతలో వుందని అభిప్రాయపడ్డారు.

చైత్యన స్నేహితురాలు - పేరు చెప్పలేదు

స్వాతికుమారి - కల్హారా బ్లాగు రాస్తారు - కల్హారా అంటే ఎర్ర కలువ పువ్వు, స్వాతి గారు తెలుగు సాహిత్యం గుంపును మొదలు పెట్టారు. దీనికి రానారె కూడా సారధ్యం వహిస్తున్నారు.

పురుషోత్తమరెడ్డి - తెబ్లాస కు కొత్త

రోహిణికుమార్ - తెలుగు బ్లాగర్లకు పరిచిత పాఠకులు.తరువాతి బ్లాగు సమావేశానికి సొంత బ్లాగుతో రావాలని హెచ్చరిక పొందారు.:-)

వెంకట రమణ - ఇంటర్నెట్లో తెలుగు శోధకులలో, తపన పడిన వారిలో మొదటి తరపు వ్యక్తి.

ఇక పరిచయాలయ్యాక కాఫీలు, పురుగులు మందులు గట్రా తాగాం.

IMG_3578
(ఎడమ వైపు నుంచి : బాలా, సురేష్ కొలిచాల గారు, రోహిణికుమార్, రమణ, వీవెన్, కందర్ప (సరిగ్గా కనబడటం లేదు), సీ.బి.రావు గారు, త్రివిక్రమ్, పురుషోత్తమ్, శ్రీనివాస రాజు, స్వాతి, అక్కిరాజు గారు)

తరువాత అందరూ కలసి ఒక గ్రూపు చిత్రం దిగాం.

IMG_3597
క్రింది వరుస, ఎడమ నుండి : కిరణ్, స్వాతి, భావన, కశ్యప్, త్రివిక్రమ్, అక్కిరాజు గారు, సురేష్ గారు.
మధ్య వరుస, ఎడమ నుండి : చందు గారు, సీ.బీ రావు గారు, చదువరి గారు, కందర్ప గారు, పురుషోత్తమ్, బాలా
పై వరుస,ఎడమ నుండి : సుధాకర్, కిరణ్ స్నేహితులు ఇద్దరు, వీవెన్, శ్రీనివాస రాజు, రోహిణి కుమార్

ఫోటోలు అయ్యాక, మరలా ఒక దగ్గర కూర్చుని చర్చ మొదలు పెట్టాం.

సురేశ్ గారు తెలుగు పదాల నూతనోత్పత్తి, దానిలో సౌలభ్యం గురించి చెప్పారు, తెలుగు పదం.ఆర్గ్ తాలుకా ఆలోచనా సరళిని వీవెన్ వివరించారు. తెలుగు పదాల నానార్ధాలు, కొత్త పదాలు రావల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. ఆంగ్ల భాష తాలుకా ప్రభావం, దాని వలన తెలుగు పదాలలో వస్తున్న కొత్త పదాలు వాడటం సామాన్య జనాలకు సౌలభ్యంగా వుంటుందని సురేశ్ గారు అభిప్రాయపడ్డారు. అయితే తెలుగు పదాలను చర్చా వేదికల ద్వారా కనుగొని వాటిని జన బాహుల్యంలోనికి తేవటానికి బ్లాగర్లు కృషి చెయ్యాలి అని వీవెన్ అభిప్రాయపడ్డారు.

తెలుగుపై సంస్కృతం ప్రభావాన్ని చర్చించటం జరిగింది. తిక్కన కాలం నుంచే వున్న సంస్కృత ప్రభావం వుందని, అది చాలా శక్తివంతమైనదని సురేశ్ గారు అభిప్రాయపడ్డారు. భాష తరతరాలుగా అభివృద్ది చెందాలి తప్ప, దానిని బలవంతంగా అభివృద్ధి చెయ్యలేమని అభిప్రాయపడ్డారు. అంతే కాక కొత్త పదాలను పోలికలున్న ఇతర ద్రవిడ భాషలు (కన్నడ, తమిళం) నుంచి తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

వేమూరి గారు శాస్త్ర పరిభాషను తెలుగీకరించటం లో చాలా కృషి చేసారని, తెలుగులో కొత్త పదాల సృష్టికి కావలసిన నియమావళిని అతని సహకారంతో ప్రయత్నించవచ్చని అక్కిరాజు గారు అభిప్రాయపడ్డారు.తెలుగు భాష లో కొత్త పదాలు చాలా వరకు, మాండలీకాలతో ముడిపడి వుంటాయని, ప్రస్తుతం కళింగాంధ్ర మాండలీక కోశం లాంటి పుస్తకాలు తయారీ అలాంటి కొత్త పదాలను పూర్వజన బాహుళ్యం నుంచి కనుక్కొనే ప్రక్రియలో భాగమని సుధాకర్ అభిప్రాయపడ్డారు..

తరువాత్ ఇన్ స్క్రిప్ట్ గురించి అందరూ మాట్లాడారు. ఆంగ్ల భాషను మన జీవితం అత్యంత ముఖ్యభాగంగా చూసే రోజులొస్తున్నాయని, అందువలన ఫొనెటిక్ ఇన్పుట్ అనేది చాలా ఉపయోగకరమని సురేశ్ కొలిచాల అభిప్రాయపడ్డారు. దీనిలో నేర్చుకునే సౌలభ్యం ఎక్కువని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఫొనెటిక్ పరికరాల వాడకం బాగా పెరుగుతుందని అన్నారు.

తరువాత తెలుగు ఫాంట్ల తయారీ గురించి చర్చ జరిగింది. దీని పైన సురేశ్ గారు కొంత వివరణ ఇచ్చారు. కొత్త ఫాంట్ల తయారీలో కష్టనష్టాలను గురించి చర్చ కొనసాగింది. తెలుగులో చాలా మంచి ఫాంట్లు వున్నాయని, వాటిని యూనీకోడు ఫాంట్లుగా మార్చే ప్రయత్నం పెద్ద పెద్ద సంస్థలు (తానా, ఆటా లాంటివి) చెయ్యాలని అభిప్రాయపడ్డారు.

విక్షనరీ పనులు : తెలుగు విక్షనరీ తయారీలో కాపీ హక్కుల ఆవశ్యకతను గూర్చి మాట్లాడారు. బ్రౌన్ పద కోశాల్లాంటివాటికి కాపీ హక్కుల సమస్య వుండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అదే విధంగా జీ.పి.యల్ లైసెన్సుల పై చర్చ, అనుమాన నివృత్తులు జరిగాయి,ఆఖరుగా తెలుగు బ్లాగుల సాంకేతిక సహాయం మీద మాట్లాడుకున్నాం. తెలుగు బ్లాగులు మొదలు పెట్టడానికి బ్లాగరు.కాం, వర్డు ప్రెస్.కాం లలో ఎదురవుతున్న సమస్యలను ముందుగానే పరిష్కరించి అందరికి అందుబాటులో కొన్ని మంచి టెంప్లేట్లు తయారు చేసి (ఈ-తెలుగు సమాఖ్యలోని అన్ని బ్లాగు సైట్ల లంకెలు ముందుగానే లభ్యమయ్యే విధంగా) అందుబాటులో వుంచాలని అనుకున్నాం.

ఇక సమయం ఏడున్నర కావస్తుండటంతో అందరూ వీడ్కోల్లు తీసుకుని బయలు దేరారు

ఈ సమావేశం సందర్చంగా రెండు అతి పెద్ద రహస్యాలు బయటపెట్టబడ్డాయి.

౦౧. పొద్దులో పేరడీలు రాసిన రచయత ఎవరు? [మన చదువరి గారే... త్రివిక్రం బయటపెట్టిన రహస్యం ఇది]

౦౨. సిరిసిరిమువ్వలు బ్లాగు రచయత ఎవరు? [చదువరి గారి మంచి అర్ధభాగం వరూధిని గారు.. స్వయానా చదువరి గారు బయటపెట్టిన రహస్యం ఇది]

పై రహస్యాలు చదవాలంటే "[]" వున్న భాగాన్ని మీ ఎలకతో సెలెక్టు చేసి చూడండి.

-సుధాకర్
శోధన : http://sodhana.blogspot.com

ఇంతింతై

ఇంతింతై వటుడింతై అని మన తెలుగు సంఘం వామనున్ని మించిపోయేలా వుంది!

--ప్రసాద్
http://blog.charasala.com

రాలేక

రాలేక పోయినందుకు (మా బుడ్డోడికి బాగోలేక హాస్పిటల్ కు వెళ్ళాల్సివచ్చింది) బాధగా వున్నా అద్భుతంగా జరిగినందుకు చాలా సంతోషంగా వుంది. ఇంకోసారి మిస్సవ్వకూడదని ఆశిస్తూ!!!

తెలుగు

తెలుగు 'వాడి' కి జై జై లు...

పొద్దులో పేరడీలు రాసిన రచయత ఎవరు?--- నేను వేసిన రాయి గురితప్పలెదు :)

-నేనుసైతం
http://nenusaitham.wordpress.com

బాగున్ది!

బాగున్ది!

ఇదెమిటి?!
ఫైర్ఫాక్స్ ఇన్డిక్ ప్లగిన్ ఇలా రాసెస్తున్ది!

ఇప్పటికే

ఇప్పటికే చాలా కాలం అయ్యింది;ఇంక పారడీ రచయిత పేరు బయట పెట్టండని, సభ్యులు, త్రివిక్రం, చదువరిగార్లను అడిగినారు. సమాధానంగా ముసి ముసి నవ్వులు వచ్చాయి. సమావేశ మధ్యలో, విరామం తరువాత, ధర్మజుడిలా చిన్న యుక్తి సారించక తప్పలేదు. అదే అశ్వద్ధామా హతఃహా కుంజరఃహాః. పారడీ రచయిత పేరు బయటకు రావటానికి, అది ఒకటే మార్గమని తలిచాను. అదీ వారి నొట చెప్పించాలని (రచయిత ఎవరో నాకు తెలిసినా), నా ప్రయత్నం.

విరామం తరువాత అందరూ settle అవుతున్నప్పుడు, చావా కిరణ్ తో అన్నాను -పారడీలు నచ్చాయా అని. సమాధానంగా తాను పారడీ భాగము -1 బాగా enjoy చేసినట్లూ, రెండవ భాగాన్ని అంతగా appreciate చెయ్యలేక పొయినట్లూ చెప్పారు. అప్పుడు నేనన్నాను; రొజూ తింటే గారెలు కూడా రుచించవు -కొంత gap ఇచ్చి నేను రెండవ భాగం రాసుండూల్సుందని. ఇందులో నేను అనే పదం, చిన్న స్వరం లో అన్నా; ఎవరికి వినపడాలో వారికి వినబడ్తే చాలని. కాని నేను అనే పదం ఎవరికోసం ఉద్దేశించించబడిందో వారికే గాక, ఈ-మాట సంపాదకులు సురేష్ కొలిచాల గారికి కూడా వినపడటం తో, కథ నేను ఊహించని మలుపు తిరిగి, సురేష్ గారు పారడీలు మీరు రాశారా? అవి బాగున్నాయని కితాబిచ్చారు. నేను అన్న పదం విన్నమిగతా వారు కూడా, పారడీ లు నేనే రాసానని నమ్మారు. మరి అప్పుడు నేను ఏమి చెయ్యాలి? సురేష్ గారితో చెప్పాను అవి నేను రాయలేదని. అది మిగతావారు కూడా విన్నారు.ఏది నిజమో, అబద్ధమో తెలియని స్తితి అది. ఇంత కథ అయ్యాక, సమావేశం చివరలో, త్రివిక్రంకు, పారడీ రచయిత పేరు బయట పెట్టక తప్పలేదు. నాగరాజ, శోధన సుధాకర్ ల పారడీలను, నాగరాజా గారు రాస్తే, మిగతావన్నీ చదువరిగారు రాసారు. రాజకీయాలే కాదు,భిన్నమైనవి రాయండన్న సలహాను sportive గా తీసుకొని, తనలోని వైవిధ్య విశ్వరూప ప్రదర్శన గావించిన, చదువరికి వేస్తున్నా ఒక వీరతాడు.

ఈ నెల ముఖ్య అతిధిగా ఈ-మాట సురేష్ గారు రావటం ఆనందకారకం. ప్రతి నెలా ఒక అతిధిని తీసుకు వద్దామా? సాహితీ గుంపు నుంచి స్వాతి రావటం ఇంకో విశేషం. గత నెలలో జ్యోతక్క, మన సమావేశానికి వచ్చారన్న విషయం మీకు తెలుసు. మహిళా బ్లాగరులు, ఇలా నిద్ర లేవటం ముదావహం.

http://etelugu.org లో, తొలిసారిగా ప్రచురితమైన, ఈ సమావేశ విశేషాలు, చక్కగా అందించిన, శోధన సుధాకర్ కు అభీనందనలు. సరళంగా, చదివించేలా ఉందీ నివేదిక. చాయా చిత్రాలు పై click చేసి చూసా. అవి expand కావటము లేదు. e-telugu.org లో సభ్యులు కాని వారు, కేవలము వ్యాసాన్ని మాత్రమే చదువగలరు గాని, వ్యాఖ్యలు చదువలేరు, రాయలేరు. ఇది ఒక లోపము. సభ్యులు కానివారు కూడా వ్యాఖ్యలు చూడగలిగితే బాగుంటుంది. వ్యాఖ్యలు రాసే సదుపాయం కలిపిస్తే ఇంకా బాగు. Select గావంప బడిన ప్రదేశములో, text కనిపించటము అనే trick/technique ఎలా చేశారో మన ఇంద్రజాలికులు, టెక్నిక్కుల మాస్టారు అయిన వీవెన్ వివరిస్తే, మిగతా బ్లాగరులకూ అది ఉపయుక్తంగా ఉండగలదు. ఈ వ్యాసాన్ని, e-తెలుగు వెబ్ సైట్లో, తొలిసారిగా, అందంగా, మన ముందుంచిన వీవెన్ కు ధన్యవాదాలు.

చదువరిగార

చదువరిగారు, వరూధినిగారి గురించి నాకు ఎప్పుడో తెలుసు. గత నెలలో పేరడి రాసినవారి గురించి వారితోనే చెప్పిద్దమనుకున్నా. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. వెళ్ళీ పోయా. ఐనా భార్యాభర్తలు ఇలా సీక్రెట్ రచనలేంటండి....రోజు రోజుకి బ్లాగర్లు పెరుగుతుంటే మన భాద్యత పెరుగుతుందనిపిస్తుంది. కాస్త ఓళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఆలోచించి రాయాలి. సునామీలు గట్రా రాకుండా......వచ్చే నెల వరూధిని గారే మహిళా బ్లాగర్ల ప్రతినిధిగా రావాలి.నెలకొకరు మహిళాబ్లాగర్లు వస్తేనే బాగుంటుంది. లేకుంటే బొత్తిగా మగవాళ్ళ సమావేశమైపోతుంది. ( ఇది కొత్తపాళీగారి డవిలాగు)

కందర్ప

కందర్ప కృష్ణ

జ్యోతి గారూ నమస్తే..
మీరు కూడా తప్పక రావలసిందే.. నాకు అందరూ పరిచయం కావద్దూ మరి!

నివేదిక

నివేదిక చక్కగా ఉంది.. ఆలస్యంగా వచ్చి అంత్యాక్షరి మిస్సయ్యామన్నమాట... నివేదికలో చావా కిరణ్ పరిచయం మిస్సయిందే?
"...పురుగులు మందులు గట్రా తాగాం." :)
'రహస్యాలను' బయటపెట్టేటప్పుడు కూడా అక్షరాలకు వెల్లవేసి భలే చమత్కారం ప్రదర్శించారు. కింది నుంచి రెండో ఫోటోలో "మూడు బీర్ల" వెనుక దూరంగా కనబడుతున్నదీ మనవాళ్ళే! కశ్యప్ & ...
రావుగారి 'అనుబంధ నివేదిక' కూడా బాగుంది. :) నాగరాజ మరియు నాగరాజా బదులు 'సాలభంజికలు' నాగరాజు అని, త్రివిక్రం అని కనిపించినచోటల్లా త్రివిక్రమ్ అని చదువుకోవాలని మనవి.
పేరడీల వీరుడి గురించి పోయిన్నెల్లోనే పొద్దులో ప్రకటించవలసింది. కానీ అప్పుడు పొద్దు కాస్త హడావుడిగా పొడవడం వల్ల ఆ విషయం తాత్కాలికంగా మరుగున పడిపోయి ఇప్పుడిలా ఇక్కడ వెలుగుచూసింది. :)

కందర్ప

కందర్ప కృష్ణ

ఒహో సుధాకర్ గారూ సమావేశానికి హాజరయ్యాన్లే అని నివేదికని చూడడం బాగా ఆలస్యం చేసుకున్నాను. బ్రహ్మాండంగా ఉంది. కానీ నేను కందర్ప కృష్ణ మూర్తిని కాదు కృష్ణ మోహన్ అని చిన్న సవరణ. ఛాయాచిత్రాలు కూడా సూపర్ గా ఉన్నాయి.

తదుపరి సమావేశం కోసం ఎదురు చూస్తూ....

కిరణ్ చావా

కిరణ్ చావా తాలుకా పరిచయం అతని వల్లనే మిస్ అయ్యిందని తెలియచేసుకుంటున్నాను. నేను పురుషోత్తం ను తీసుకురావటానికి బయటకు వెళ్తూ రాయండని కిరణ్ కు నా లాప్ టాప్ ఇచ్చా...గానీ అది లాక్ అయిపోయింది. అందువలన కిరణ్ కూడా నేను వచ్చేంత వరకూ రాయలేక పోయాడు. అయినా కిరణ్ చావా కు పరిచయం అవసరమంటారా? :-)

సుధాకర్
శోధన : http://sodhana.blogspot.com

హైదరాబాదు

హైదరాబాదు నుంచి స్థానచలనం కలిగాక మొదటి సారి అయ్యో ఎదో కోల్పోతున్నానే అనే బాధ కలిగింది :-( దినదిన ప్రవర్ధమానమవుతున్న హైతెబ్లాసం సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు దొరకాలని కోరుకుంటూ, ఇంత చక్కని వివరణ ఇచ్చిన సుధాకర్ గారికి ధన్యవాదాలు, విచ్చేసిన ఈ-తెలుగు సభ్యులకు అభినందనలు.

ఈ నివేదిక

ఈ నివేదిక చాలా బాగుంది. ఈతెలుగు సైటొకటుందని అందరికీ మళ్ళీ ఓసారి గుర్తు చేసారు.
అక్కిరాజు, సురేశ్ గార్ల రాక సమావేశానికి శోభనిచ్చింది.
సమావేశం చాలా హాయిగా జరిగింది. సరాదాగానూ ఉంది, సీరియస్ చర్చలూ జరిగాయి.
సురేశ్ కొలిచాల గారు తన తెరపేరుకు - వార్త్తి క్ (రెండు త వత్తులను గమనించండి) - వివరణ చెప్పారు.
శ్రీహర్ష గారూ, మీ బాధ సహజమే! క్రమం తప్పకుండా వచ్చే మీవంటి సభ్యులు లేకపోవడం అక్కడ వెలితే.

అన్నిటికంటే ముఖ్యం.. మనవాళ్ళ ఏర్పాట్లు! ముగ్గురు మైక్రోసాఫ్టు మొనగాళ్ళు - సుధాకర్, చావాకిరణ్, వెంకటరమణ - చక్కటి ఏర్పాట్లు చేసారు. కాఫీలు, డౌనట్లూ, బూరెలూ, సమావేశపు గదీ, వాతావరణం.. అన్నీ బాగున్నాయి. జనాలను గేటు దగ్గర కలుసుకుని, వెంటబెట్టుకుని సమావేశం దాకా తీసుకుని రావడానికి కష్టపడ్డారు పాపం.

వచ్చేనెల సమావేశం ఎక్కడనేది తేల్చలేదు. మళ్ళీ మైక్రోసాఫ్టు కెళ్దామా?:)

అమ్మో, అంత

అమ్మో, అంత దూరం మళ్ళీనా?

How About kukutpalli?

How About kukutpalli?

---- http://oremuna.com/blog

ఎస్సారు

ఎస్సారు నగరు లేదా కూకటపల్లిలో అయితే బాగుంటుంది.
--
వెంకట రమణ
http://uvramana.wordpress.com

అప్పుడే

అప్పుడే మరలా సమావేశానికి ప్రిపరేషన్లు మొదలెట్టేసారన్నమాట. భళి భళి.

- ప్రవీణ్ గార్లపాటి
నా మదిలో ... | http://praveengarlapati.blogspot.com

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer