జూలై నెల హైదరాబాదు సమావేశ విశేషాలు

వర్షాకాలంలో రెండవ సమావేశం ఇది. ఈ నెల సమావేశాలకు ప్రత్యేక అతిధి కంప్యూటర్ ఎరా సంపాదకులు నల్లమోతు శ్రీధర్ గారు. మధ్యలో అనుకున్న అతిధి (వర్షం) కూడా వచ్చి వెళ్ళాడు. కందర్ప కృష్ణమోహన్ గారి నాలుగేళ్ళపాప అతిచిన్న అతిధి. చదువరి, సుధాకర్‌లు హైలో లేకపోవడం ఓ లోటు. ఈసారి ఎవరూ కెమెరాలు తేకపోవడంలో విశేషాలు చూపించలేకున్నాం.

శ్రీధర్ గారు ఈ నెల కంప్యూటర్ ఎరా సంచికని వచ్చినవారందరికీ ఉచితంగా అందించారు.

రావు గారు నేను (వీవెన్), కృష్ణకాంత్ పార్కుకు వెళ్ళేసరికే చావా కిరణ్, నల్లమోతు శ్రీధర్, త్రివిక్రమ్, వెంకట రమణ, దాట్ల శ్రీనివాసరాజులు ఆసరికే అక్కడ కూర్చుని ముచ్చటిస్తున్నారు. తర్వాత కందర్ప కృష్ణమోహన్ గారు అక్కిరాజు గారు వచ్చి చేరారు. కృష్ణమోహన్ గారు వారి నాలుగేళ్ళ పాప జయలక్ష్మిని కూడా తీసుకొచ్చారు. అక్కిరాజుగారి భార్యామణి స్వర్ణ, పుత్రిక భావన పార్కులో విహరిస్తూ మమ్మలని చేరారు.

ఓ బెంచీపై ఎండ పడుతూ కొంచెం అసౌకర్యంగా ఉండడంతో వచ్చిక మీదకి చేరాం. ఎన్ని సమావేశాలైనా తప్పని పరిచయ కార్యక్రమం మళ్ళీ. పరిచయాలలో శ్రీధర్ గారు త్వరలో తమ పత్రికలో తెలుగు బ్లాగుల గురించి వ్యాసం ప్రచురిస్తామని, తయారుగా ఉంది కానీ మరిన్ని వివరాలకోసం వేచి ఉన్నానని చెప్పారు. అంతేగాక మన విశేషాలని తరచూ ప్రచురిస్తూ ఉంటామని, మీడియాపరంగా తన శక్తిమేర సహాయం చేస్తానని చెప్పారు.

ఇలా పరిచయాల కార్యక్రమం కొనసాగుతుండగానే అనుకున్న అతిధి (వర్షం) రానే వచ్చాడు. అందరం దగ్గరే ఉన్న గోపురంలోకి పరిగెత్తాం. ఐదు నిమిషాల్లో వర్షం తగ్గుముఖం పట్టడంతో, సమావేశం రావు గారింటివద్ద కొనసాగిద్దా మని బయలుదేరాం. ఇంతలో మేఘాలు తేలిపోవడంతో మళ్ళీ ముందు కూర్చున్న బెంచీల వద్దకే చేరాం.

తర్వాత తెలుగుపదం గురించి చర్చించాం. తెలుగుపదానికి సాంప్రదాయ మాధ్యమాలలో ప్రచారం కల్పించాలని చావా కిరణ్ తెలుపగా, ఇదింకా ప్రారంభ దశలోనే ఉన్నందున, మరింత కృషి తర్వాత ప్రచార ప్రయత్నాలు చేద్దామని వీవెన్ అన్నాడు. 7-జిప్ తెలుగులో రాబోతుందని కూడా అనుకున్నాం. గ్నూ సైటుని తెలుగులోకి అనువదించడానికి కృషి చేయాలని చావా కిరణ్ చెప్పాడు.

రావుగారు తెనాలిలో పాత్రికేయులు, రచయతలతో తాను నిర్వహించిన యూనికోడ్ వర్క్‌షాప్ గురించి వివరించారు. దీనిపై వివరమైన టపారాస్తానన్నారు. ఈ వర్క్‌షాప్ కి ఫాలోఅప్‌గా రెండవ విడతకూడా నిర్వహిస్తానన్నారు. తన బెంగుళూరు సందర్శనలో కూడా ఇలాంటి వర్క్‌షాప్ ఒకటి నిర్వహించే ఆలోచన ఉన్నట్టు తెలిపారు. విశాఖపట్టణంలో కూడా ఓ వర్క్‌షాప్ చేసే విషయాన్ని ఆలోచించాలని అనుకున్నాం. తెవికీ ప్రచారరధంగా ఈ ప్రయత్నానికి వికీమీడియా సహాయం ఎంతుంటుందో అని ప్రశ్నించుకున్నాం.

కేఫ్‌టేరియాకి బయలుదేరదాం అనుకోగానే, అక్కిరాజుగారి కుటుంబం మరియు శ్రీధర్ గారు సెలవు అంటూ వీడ్కోలు తీసుకున్నారు. మిగతావారు చర్చని కొనసాగించాం.

కూడలిలో కాలహరణం, రావుగారి టూరింగ్ టాకీస్, తెలుగుపదం గుంపులో చర్చలు, ఋ ౠ ఌ ౡ బ్లాగ్విజయోపాయాలు, తెలుగులో సంక్షిప్తపదాలు, ఇంకా మరెన్నో. వచ్చే సమావేశాలలో స్ధానికీకరణ చేయాల్సిన కొన్ని పదాలని సమావేశానికి తీసుకురావాలనుకున్నాం. ఇంక చీకటి పడుతుండడంతో అందరం వీడ్కోలు చెప్పుకుని ఇళ్ళకు బయలుదేరాం.

(మిగతావారు, నేను మరచిన, రాయని విశేషాలవి వ్యాఖ్యల్లో రాయండి.)

వికీమీడియ

వికీమీడియా ఇలాంటి ప్రయత్నాలకు చాలామటుకు సహాయాం అందిస్తుంది. అయితే దానికో ప్రతిపాదన రాయాలి. ఈ లింకు (http://meta.wikimedia.org/wiki/Chapters_committee/Events/Kannada_Press_C...) లో కన్నడ వికీ వాళ్లు నిర్వహించిన సదస్సుకు వికిమీడియానే ఆర్ధిక సహాయం చేసింది

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer