2008 జనవరి నెల eతెలుగు సమావేశ వివరాలు

ఈ-తెలుగు సమావేశము

తేదీః 06-01-2008; వేదికః కృష్ణకాంత్ పార్క్, యూసుఫ్‌గూడా, హైదరాబాద్


ఈసారి సమావేశానికి ఒక ప్రత్యేకత ఉంది. పత్రికా విలేకరులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించాం. నల్లమోతు శ్రీధర్, కశ్యప్ అన్ని పత్రికలకు వెళ్ళి ప్రెస్‌నోటును ఇచ్చి, సమావేశానికి ఆహ్వానించారు. ఈనాడు, హిందూ పత్రికల ప్రతినిధులు సానుకూలంగా స్పందించి సమావేశానికి వచ్చారు.

కార్య క్రమణిక

  • సభ్యుల పరిచయ కార్యక్రమం
  • అంతర్జాలంలో తెలుగు సులభంగా వాడడానికి ఇప్పటికే అందుబాటులో ఉన్న ఉపకరణాలు, అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి చెందడానికి కావలసిన సాంకేతిక సహాయ సహకారములను గూర్చి విలేకరులకు వివరించడం.
  • కొన్ని కంప్యూటర్ అప్లికేషన్సు మరియు సాఫ్ట్వేర్ల స్థానికీకరణ గురించి చర్చ.
  • కొత్త సభ్యులకు తెలుగులో బ్లాగు మొదలుపెట్టే విధానం గురించి వివరణ.

హాజరైన సభ్యులుః

పచ్చిక మీద కూచ్చున్నవారు, కింది నుండి: దాట్ల శ్రీనివాసరాజు (హరివిల్లు), ప్రసాద్ (గణపతి సహచరుడు), వెంకటేష్ (భూమిక), గణపతి (రైతే రాజు)
గట్టు మీద కూచ్చున్నవారు, కింది నుండి: కట్టా విజయ్ (జాబిలి), తుమ్మల శిరీష్ కుమార్ (చదువరి), వెంకట రమణ (వెంకటరమణ బ్లాగు), సి.బి.రావు (దీప్తిధార), చావా కిరణ్ (ఒరెమూనా), దూర్వాసుల పద్మనాభం (తెలుగు గ్రీటింగ్స్), వీవెన్ (వీవెనుడి టెక్కునిక్కులు)
వెనుక నిలబడ్డవారు: నల్లమోతు శ్రీధర్ (శ్రీధర్ సాంకేతికాలు), కందర్ప కృష్ణమోహన్ (తెలుగుతీపి), రవికిరణ్ (పూలవాన), మోహనరెడ్డి (కొత్త సభ్యులు, ఇంకా బ్లాగు లేదు), కృష్ణ కిషోర్ (నువ్వుశెట్టి బ్రదర్స్)
కశ్యప్ (కబుర్లు చెప్పాలని ఉంది) కూడా వచ్చారు గానీ, ఆలస్యంగా రావడం చేత ఈ ఫోటోలో లేరు

ప్రత్యేక ఆహ్వానితులుః

  1. కెబిఎల్ శర్మ - ఈనాడు
  2. ఘంటసాల వసంతకుమార్ – ఈనాడు
  3. సాయిగోపాల్ – ది హిందూ
  4. వెంకటేష్ - భూమిక పత్రిక నుండి వచ్చారు.

సమావేశ వివరాలుః

ముఖ్యాంశాలు
సమావేశం సాయంత్రం మూడున్నరకు మొదలైంది. రైతేరాజు బ్లాగును మొదలుపెట్టిన బిఎల్ఎస్ గణపతి గారు ఈ సమావేశానికి అనుకోకుండా వచ్చి సంభ్రమం కలిగించిన అతిథి. ఆయన్ను చూడగానే మిగతా బ్లాగరులందరూ చప్పట్లతో ఆనందం ప్రకటించి ఆహ్వానించారు. పది నెలల కిందటనే కంప్యూటరుతో పనిచెయ్యడం నేర్చుకుని, బ్లాగుల గురించి తెలుసుకుని ఆయన బ్లాగును మొదలుపెట్టారు. పశ్చిమ గోదావరికి చెందిన ఆయన అక్కడే కాక, మహారాష్ట్రలో కూడా మెట్ట వ్యవసాయం చేస్తూ ఉంటారు. "నాకు ఇంగ్లీషు రాదు. రైతు కష్టానికి తగిన ప్రతిఫలం కావాలంటే రైతు కొత్త విషయాలు నేర్చుకోవాలి. అందుకు గాను వాళ్ళు కొత్త టెక్నాలజీని వాడుకోవాలి. బ్లాగును నేను అందుకు వాడతాను" అని ఆయన చెప్పినపుడు సభ్యులంతా తమ హర్షాన్ని తెలుపుతూ చప్పట్లు చరిచారు. "సమావేశానికి అందరూ వస్తారు, కలిసి నా సందేహాలను తీర్చుకోవచ్చని వచ్చాను" అని ఆయన చెప్పారు. eతెలుగు ఉద్యమ విజయాల్లో "రైతేరాజు" ఘనమైనదిగా సభ్యులు భావించారు.

నెజ్జనుల వలయం

విలేకరుల ప్రశ్నలు, సందేహాలకు సమాధానాలు అందించే క్రమంలో.. సభ్యులంతా కలిసి సంస్థాగతం కావడానికి తీసుకున్న, తీసుకుంటున్న నిర్ణయాలూ చర్యల గురించి వివరించారు. ఒక సంస్థగా ఏర్పడడానికి ఇప్పటికే తీసుకున్న చర్యలగురించి చదువరి వివరించారు. ఇంకా యూనికోడ్ గురించి వీవెన్, వెంకటరమణ వివరిస్తూ వారి సందేహాలను నివృత్తి చేసారు. వీవెన్ లేఖిని గురించి వివరించారు. <!-- ఈనాడు విలేకరి శర్మ గారు గతంలో నల్లమోతు శ్రీధర్ గారి వద్ద హార్డువేర్ గురించి నేర్చుకున్నారని పరిచయాల ద్వారా తెలిసింది. --> భారత ప్రభుత్వం తయారుచేసిన సాఫ్ట్వేర్ గురించి చావా కిరణ్ తెలియజేసారు. "కంప్యూటరులో తెలుగు ఎందుకు, ఎలా" అనే పుస్తకం ఉద్దేశ్యాన్ని చదువరి వివరించారు. ఈ పుస్తకాన్ని విలేకరులకు, సభ్యులకు పంచారు. కంప్యూటర్లో తెలుగు గురించిన విశేషాలను, వికీ లక్ష్యాలను మరియు తెలుగు వికీలో ఎలా పనిచేయాలో మోహనరెడ్డి గారికి వెంకటరమణ, వీవెన్ వివరించారు.

ఈ-తెలుగుసంఘం ఆశయాల గురించి వీవెన్ విలేకరి మిత్రులకు వివరించారు. వీవెన్, వెంకటరమణ, చావా కిరణ్ విలేకరుల ప్రశ్నలకు కింది విధంగా సమాధానాలు ఇచ్చారు.

  • "బ్లాగరులంతా తమతమ వృత్తుల్లో నిమగ్నమై ఉంటారు. బ్లాగులకు తమ సమయాన్ని ఎలా కేటాయిస్తున్నార"నే ప్రశ్నకు, తమ తీరిక వేళల్లోనే చేస్తూ ఉంటామని సభ్యులు చెప్పారు.
  • చాలా వెబ్ సైట్లు మామూలుగా ఇంగ్లీషులో ఉంటాయి. వాటిని తెలుగులో మార్చడం ఈతెలుగు సభ్యులే చేస్తూ ఉంటారు.
  • సాఫ్ట్వేర్ల స్థానికీకరణ గూర్చి వీవెన్ వివరించారు. వర్డ్ ప్రెస్ 72% పూర్తి కావచ్చిందని చెబుతూ దాదాపు 1000 స్ట్రింగ్స్ ఇంకా అనువదించవలసినవి ఉన్నాయన్నారు. గూగుల్ అప్లికేషన్స్ మరింత బాగా అనువదించడానికి ఆ పని చేయడానికి ఇష్టమున్నవారు కావాలని అభిప్రాయపడ్డారు. ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ 5.3% మరియు 7zip అనే కంప్రెషన్ సాఫ్ట్వేర్ 50% పైగా అనువదించబడిందని చెప్పారు.
  • లినక్సు మొదలైన వాటి మీద అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. వీరందరినీ సమన్వయపరచే పని కూడా ఈతెలుగు చేస్తుంది.
  • అసలిలా సంఘంలా ఏర్పడాలని ఎందుకనిపించింది అన్న ప్రశ్నకు: మేము గత కొన్నేళ్ళుగా వికీపీడియా, బ్లాగు మొదలైన వివిధ స్థలాల్లో పనిచేస్తూ ఉన్నాం. ఆయా పనులన్నిటినీ సమన్వయపరచే ఉద్దేశ్యంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసాం అని వీవెన్ చెప్పారు.
  • చైనా, జపాను, కొరియా వంటి కొన్ని దేశాల్లో సాఫ్టువేర్లన్నీ తమతమ భాషల్లోనే ఉంటాయి. ఆయా దేశాల్లోని కంపెనీలు తమ ఆర్థిక పరిస్థితి నివేదికలన్నిటినీ తమతమ భాషల్లోనే తయారు చేస్తూ ఉంటారు. ఆయాదేశాల్లో విడుదల చేసే సాఫ్ట్వేర్ అప్లికేషన్లను కూడా వారి భాషల్లోనే విడుదల చేస్తారు.
  • వికీపీడియా వ్యాసాల సంఖ్యను పరిశీలిస్తే, ఇంగ్లీషేతర భాషల వికీల్లో ఇంగ్లీషు కంటే చాలా ఎక్కువ వ్యాసాలున్నాయి. దాన్నిబట్టి, ఇతర భాషల ప్రాముఖ్యత తెలుస్తోంది.
  • అంతేకాక, ఇంగ్లీషు తెలిసిన వాళ్ళకు కూడా సాఫ్ట్వేర్ అప్లికేషన్ల ఇంటరుఫేసులోని కొన్ని పదాలు తెలియకపోవచ్చు.
  • "కంప్యూటరు ఎరా" తరపున కూడలిలో ఒక కబుర్ల స్థలాన్ని తెరిచాం. దీనిద్వారా సభ్యులకు సాంకేతిక సహాయాన్ని వెనువెంటనే అందిస్తున్నాం. శ్రీధర్, జ్యోతి, వీవెన్ మొదలైన వారు ఈ పనిలో పాల్గొంటూ ఉన్నారు.
  • యూనికోడ్ గురించిన వివరణలతో కూడిన చర్చ జరిగింది.

ఈనాడు పత్రిక నుండి వచ్చిన ఛాయాగ్రాహకుడు ఘంటసాల వసంతకుమార్ గారు సమావేశం చివర్లో సభ్యుల ఫోటోలు తీసుకున్నారు. ఆ తరువాత అందరం క్యాంటీన్‌కి వెళ్ళి కాఫీలు తాగి ఒకరికొకరు భారంగా వీడ్కోలు చెప్పుకున్నాము.

ఎడమ నుండి: మోహనరెడ్డి, కట్టా విజయ్, నల్లమోతు శ్రీధర్, గణపతి

అనల్పాంశాలు

  • "భూమిక" పత్రిక నిర్వాహకులు తమ పత్రికను, తాము ముద్రించిన స్త్రీ సంబంధ విశేషాలతో కూర్చిన ఒక పుస్తకాన్ని పంపించారు. పత్రికను 10 రూపాయలకు, పుస్తకాన్ని 50 రూపాయలకు సభ్యులకు అమ్మారు.
  • సమావేశం జరిగిన పార్కు లోకి తిండి పదార్దాలను అనుమతించకపోవడం చేత చదువరి వాటిని బయటే ఉంచేసి రాగా, కందర్ప కృష్ణమోహను చాకచక్యంగా లోపలికి తేగలిగారు. సమావేశంలో ఒకసారి, ముగించి బయటికి వెళ్ళాక మరోసారి సభ్యులు పసందైన ఆ తీపి పదార్ధాలను సేవించారు.
  • "ఒరెమూనా అంటే ఏంటి" అనే సందేహం మరోసారి తలెత్తింది.
  • హిందూ విలేకరి సాయి గోపాల్ గారికి ఇంగ్లీషులో బ్లాగు ఉంది.
  • మీ పత్రికలో ఏమేం చేస్తుంటారు, చేస్తున్నారు అంటూ సభ్యులు పాత్రికేయులను ఎదురు ఇంటర్వ్యూలు చేసారు.
  • సభ్యులు సమావేశ వివరాలను ఆడియో ఫైళ్ళుగా తమ తమ కెమెరాలు, ఎమ్‌పీ3 ప్లేయర్లలో రికార్డు చేసారు.
  • సమావేశం జరిగిన మరుసటి రోజే హిందూ పత్రికలో వార్త వచ్చేసింది. అయితే అందులో అనేక తప్పులు దొర్లాయి. ఈ విషయమై నెజ్జనులు తమ నిరసనను తెలిపారు

ఎడమ నుండి: కె.బి.ఎల్.శర్మ (ఈనాడు), సి.బి.రావు, కృష్ణ కిషోర్, రవికిరణ్

గమనికలు

  • ఫిబ్రవరి రెండో ఆదివారం నాడు జరుప తలపెట్టిన సమావేశానికి ప్రవాసాంధ్రులొకరిద్దరు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
  • సభ్యులు రికార్డు చేసిన ఆడియో ఫైలును అప్‌లోడు చేసి లింకు ఇస్తాము.

ఎంత వివరంగా ఈ నివేదికను రాసినా..,
సమావేశానికి వచ్చి, అక్కడి వాతావరణంలో సభ్యుల ముచ్చట్ల మధ్య, చెతుర్లూ చెణుకుల మధ్య, కాజాలూ, బర్ఫీలూ నంజుకుంటూ, నెట్లో తెలుగు వెలుగుల గురించి చర్చించుకోవడంలో ఉండే ఆనందంలో శతాంశం కూడా ఈ నివేదికను చదివి పొందజాలరు. ఇక్కడ చెప్పిన కబుర్ల కంటే చెప్పని విషయాలు ఎన్నో రెట్లున్నాయి. సమావేశానికి రాలేకపోయిన సభ్యులపై సానుభూతితోనూ, వచ్చే సమావేశనికి హై. లో ఉండే సభ్యులంతా రావాలని కోరుతూనూ ఈ నివేదికను ముగిస్తున్నాం.


ఫోటోలు: సి.బి.రావు
నివేదిక: కందర్ప కృష్ణమోహన్, తుమ్మల శిరీష్ కుమార్

వ్యాఖ్యలు

వ్యాసం

వ్యాసం చక్కగా రాసారు.
భేష్ కందర్ప, చదువరి.

ఇదో మంచి ఆరంభం. ఓపికగా అన్ని పత్రికాఫీసులకూ వెళ్ళి ఆహ్వానించిన శ్రీధర్ గారిని, కశ్యప్ నీ అభినందించవలసిందే.

ఇకపోతే పత్రికల ప్రతినిధులు వచ్చినందుకు వారిక్కూడా ధన్యవాదాలు. ఇక ముందు కూడా నెట్ లో తెలుగు మీద ఓ కన్ను కాదు కాదు రెండు కళ్ళూ వేసి ఉంచండి.

ఇంత మంది జనాన్ని చూస్తేనే కడుపు నిండిపోతుంది. దానితో పాటు తినడానికి కూడా మళ్ళీ కాజాలు, బర్ఫీలు. మీ పనే బాగుంది.

- ప్రవీణ్ గార్లపాటి
నా మదిలో ... | http://praveengarlapati.blogspot.com

తెలుగు

తెలుగు బ్లాగరు సోదరులు సమావేసము చాలాబాగుంది,సమావేసానికి వచిన తెలుగు బ్లాగరులు యొక్క సక్యతా,సహాకారం ప్రత్యక్షంగా చూసి చాలా ఆనందంగా ఉంది, వారి అందరికి నా దన్యవాదములు, తెలుగు బ్లాగరులు అభివ్రుదికి క్రుశి చేస్తున వీవెన్ గార్కి, చావా కిరన్ గార్కి, వెంకటరమన గార్కి, శీదర్ గార్కి, సి.బి.ఆర్ గార్కి, కస్యప్ గార్కి ప్రతీ ఒక్కరికి నా హ్రుదయపూర్వక అభినందనలు మరియు బ్లాగరులు అందరికి సంక్రాంతి శుబాకాంక్షలు. మీ ganapathi, http://farmeristheking.blogspot.com