ఈసారి సమావేశానికి ప్రత్యేక ఆకర్షణలు తెవికీలో చురుగ్గా పాల్గొంటున్న సుధాకరబాబు (కాసుబాబు), వికీసోర్సులో అన్వేషి అనబడు శేషగిరి, బాల్‌పెన్నుతో అత్యంత అద్భుతంగా చిత్రాలు గీసిన బుసాని పృథ్వీరాజు వర్మ, స్వాతి వాళ్ళబ్బాయి కాబోయే బ్లాగరి చిన్నారి ప్రహసిత్.
కొత్త సభ్యుల పరిచయాలు: ఎల్. ఉషారాణి, బుసాని పృథ్వీరాజు వర్మ (మెడికల్ ట్రాన్స్క్రిప్టర్), సత్యనారాయణ శాస్త్రి (డి టి పి డిజైనర్), శరత్ రెడ్డి (9వ తరగతి విద్యార్థి), సాయి చరణ్ (10వ తరగతి విద్యార్థి), 03-02-2008 నాటి ఈనాడు పత్రిక వ్యాసానికి ప్రభావితులై నేరుగా సమావేశానికి వచ్చిన కొత్త సభ్యులుగా పరిచయమయ్యారు.
ఎడమ నుండి వరుసగా: స్వాతి, శరత్ రెడ్డి, విజయ్ కట్టా, సాయి చరణ్, సత్యనారాయణ శాస్త్రి, ఉషారాణి
తరువాత 03-02-2008 నాటి ఈనాడు పత్రిక వ్యాసం గురించిన చర్చ జరిగింది. వ్యాసం చాలా చక్కగానూ, ఎంతో ప్రభావితం చేసేది గానూ ఉందని సభ్యులందరూ ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. మునుపటి కంటే ఈ సారి ఎక్కువమంది కొత్తవారు తెవికీ రాసే ప్రయత్నం చేసారు. శహభాష్ అని భుజం తట్టుకోడమే కాక మరింత క్రియాశీల కార్యకర్తలమై పనిచేయవలసిన ఆవశ్యకతను అందరూ గుర్తించారు.
ఎడమ నుండి వరుసగా: ఉషారాణి, పృథ్వీరాజ్, శ్రీనివాస, త్రివిక్రమ్, నల్లమోతు శ్రీధర్
చావా కిరణ్ తెవికీలో మన ఊరు పేజీ మొలకల గురించి అందులోని సాధక బాధకాల గురించి వివరించారు. అన్ని ఊళ్లలోనూ ఉండేవి కాకుండా ఆ గ్రామానికే ప్రత్యేకమైన అంశాలు రాస్తే బాగుంటుంది. అలాగే పేజీలను బొమ్మల కొలువుగా మార్చనవసరం లేదనీ అనుకున్నాం. తెవికీలో ఉంచదగ్గవిగా అనిపించిన విషయాలను (సమాచారం/బొమ్మలు) మాత్రమే ఎగుమతి చేయవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
వివిధ సాఫ్ట్‌వేర్ల అనువాద స్థితి గురించిన చర్చలో శోధన సుధాకర్ మాట్లాడుతూ, మనం సమావేశమైనపుడే ఎవరైనా ఒకరిద్దరు అంకోపరి(లాప్‌టాప్)లను తెచ్చి అక్కడికక్కడే ఔత్సాహిక సభ్యులచేత అనువాద ప్రక్రియ మొదలుపెట్టిస్తే బాగుంటుందని ప్రతిపాదించారు. సభ్యులందరూ ఈ ప్రతిపాదనకు తమ అంగీకారాన్ని తెలుపుతూ ఈ ప్రక్రియను ‘అనువాద యజ్ఞం’ పేరుతో నడిపిస్తామని ముందుకు వచ్చారు.
ఎడమ నుండి వరుసగా: వీవెన్, చావా కిరణ్, సుధాకర్, శేషగిరి, కాసుబాబు
తెవికీ మిత్రులు కాజా సుధాకరబాబు గారు మాట్లాడుతూ, ఉన్న బ్లాగులన్నిటిలో వాసికెక్కిన టపాలను గుర్తించి వాటిని తెవికీలోకి (వికీలో చేర్చదగిన అంశాలను మాత్రమే) ఎగుమతి చేయడానికి సదరు బ్లాగు యజమానులు అనుమతిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. అందుకు గాను తెలుగుబ్లాగు గుంపుకి ఒక వేగు పంపమని స్వాతికుమారి గారు సూచించారు.
తరువాత ప్రవీణ్ గార్లపాటి గారి బ్లాగు పుస్తకం ప్రతిపాదన గురించిన చర్చ జరిగింది. సభ్యులందరినీ ఈ విషయమై చురుగ్గా పాల్గొనవలసినదిగా కోరడం జరిగింది.
ఎడమ నుండి వరుసగా: సీబీరావు (తెల్ల టీషర్టు), శరత్, సాయిచరణ్, విజయ్ కట్టా, సత్యనారాయణ శాస్త్రి
సభ్యులు తెచ్చిన కుకీస్ మరియు స్వీటు-హాటు అందరం పంచుకొని, క్యాంటీన్‌లో తేనీరు సేవించి , మధ్యలో సభ్యులందరూ ఉపసమూహాలుగా ఏర్పడి ఎన్నో సాంకేతిక పరమైన విషయాలు, వాటిలోని సాధక బాధకాలు చర్చించుకొని ఎన్నో సందేహాలను తీర్చుకొని అందరూ వీడ్కోలు తీసుకొన్నారు.
మా తెలుగుతల్లికి మల్లెపూదండ.. మా కన్నతల్లికి మంగళారతులు...........
కార్యక్రమణిక:
హాజరైన సభ్యులు:
వచనం: కందర్ప, శ్రీనివాస
వ్యాఖ్యలు
ఈనాడు లో వ్యాసం చూసి, కొందరు ఈ సమావేశానికి హాజరు కావటం విశేషమే.