డిసెంబర్ నెల e-తెలుగు సమావేశ వివరాలు

చల్లని డిసెంబరు నెలలో , పుస్తక ప్రదర్శన జరిగే హైదరాబాదు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా దగ్గర మన e తెలుగు సమావేశం జరిగింది. గంట ముందుగానే ఇంటినుండి బయలుదేరి దారిలో తెవికీ పుట్టినరోజు కదాని కేకు తీసుకుని దానిమీద పేరు తెలుగులో నేనే రాసా. (ఇంగ్లీషులో రాస్తే బాగోదని.ఆ దుకాణంలో అబ్బాయి ముస్లిమ్ తెలుగు రాదన్నాడు మరి ), స్వీట్స్ తీసుకుని పీపుల్స్ ప్లాజాకు వెళ్ళి హాయిగా ఒక్కో దుకాణం చూస్తూ కొన్ని మంచి పుస్తకాలు కొన్నాను. కొనాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అలా కంప్యూటర్ ఎరా వారి విజేత పబ్లికేషన్స్ స్టాల్‍లో పుస్తకాలు చూసి తెలుగు అకాడమీలోకి వెళుతుండగా శ్రీధర్ వచ్చాడు. విజేత పబ్లికేషన్స్ వారి కంప్యూటర్ ఎరా స్పెషల్ బుక్స్ చూసి బావున్నాయి అనుకున్న నాకు అవి శ్రీధర్ నుండి బహుమతిగా లభించాయి. అలా మాట్లాడుతూ గేటు వరకు వచ్చి నిలబడ్డ కొద్ది సేపటికే అక్కాయ్ అంటూ కందర్ప కృష్ణమోహన్, దూర్వాసుల పద్మనాభంగారు వచ్చారు. వీవెన్, మురళిగారు బయలుదేరారని తెలిసింది. మాటల సందర్భంలో కలగూరగంప బ్లాగుకర్త తాడేపల్లిగారి గురించి కొంచం చర్చ జరిగింది. ఆయన ఓ గ్రంధాలయం వంటివారు. కాని ఆయన రచనలు ,మాటలు అందరు అర్ధం చేసుకోవడం కాస్త కష్టం అనుకున్నాం. ఎక్కడ కూర్చుందామని దిక్కులు చూస్తున్నంతలో వీవెన్, దాట్ల శ్రీనివాసరాజు, వెంకటరమణ, వెనకాలే సిబిరావుగారు వచ్చారు. మరి కొద్దిసేపటికి వలివేటి మురళిగారు తమ స్నేహితులతో వచ్చారు. వీరందరు మన సమావేశానికి కొత్త. సరే ఎక్కడ కూర్చుందామని అటు ఇటు చూసి స్టేజీ పైన ఖాళీగా ఉంటే అక్కడి బెంచీలపై సెటిల్ అయ్యాం. ముందుగా నేను స్వీట్స్ ఇచ్చా అందరకీ , మా పిల్లలిద్దరికి హైదరాబాదులోనే ఉద్యోగం వచ్చిందని.

కంప్యూటర్ పుస్తకాలు

కంప్యూటర్ ఎరా స్పెషల్ బుక్స్

ఈరోజు వచ్చిన సభ్యులు..

 1. సిబిరావు..
 2. వీవెన్
 3. వెంకటరమణ
 4. దాట్ల శ్రీనివాసరాజు
 5. దూర్వాసుల పద్మనాభం
 6. వలివేటి మురళి - ముఖ్య అతిథి
 7. నాగప్రకాశ్
 8. మదన్ మోహన్
 9. కృష్ణ కళ్యాణ్
 10. నల్లమోతు శ్రీధర్
 11. జ్యోతి

ఎదురు చూపులు

నాగప్రకాశ్,, మదన్ మోహన్, శ్రీనివాసరాజు, కృష్ణమోహన్, పద్మనాభంగారు

వలివేటి మురళిగారు తను విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు వెళ్ళినపుడు తనకు నచ్చిన రెండు విషయాలను ప్రస్తావించారు. ఒకటి - తెలుగులో సంతకం చేయడం, రెండు - తెలుగులో విజిటింగ్ కార్డులు చేయించడం. ( కృష్ణమోహన్ తన కార్డులను ఎప్పుడో తెలుగులోనే చేయించాడు). నల్లమోతు శ్రీధర్ తెచ్చిన స్పెషల్ పుస్తకాలు అందరికీ చూపించాడు. మేము కూర్చున్న స్థలంలో వాళ్ళకి ఏదో పని ఉందంటే లేచి ప్రక్కనే ఉన్న పచ్చిక బయలులో కూర్చున్నాము. ముందుగా పరిచయాలు.ఈ రోజు కొత్తగా వచ్చినవారి పరిచయాలు..

వలివేటి మురళీకృష్ణ గారు : ఈయన చీరాలవాసి. కొన్నేళ్ళు సౌదీలో ఉన్నారు. ఐటి పరిశ్రమలో మంచి అనుభవముంది.
vComNet అని సొంత పరిశ్రమ ఉంది. మొత్తం కార్యాచరణ అంతా చీరాల నుండే చెయ్యాలని వీరి ఆకాంక్ష. అలానే చేస్తున్నారు. IT enabled services, Portals వీరి వృత్తిలో విభాగాలు. వీరు GETA అని ఒక సంస్థను కూడా అక్కడ నిర్వహిస్తున్నారు. దాని ఉద్దేశ్యం career councelling. వీరికి తెలుగుదనం అనే బ్లాగు, తెలుగుదనం, తెలుగుదుకాణం అనే వెబ్‍సైట్లు ఉన్నాయి. మొత్తం యూనీకోడ్‍లో తెలుగులోని విషయాలన్నీ అందించాలని వీరి కోరిక.

నాగప్రకాష్ గారు: వీరు వలివేటి గారి స్నేహితులు. వీరు Reality Management అనే సంస్థలొ చేస్తున్నారు. వీరికీ 10 సంవత్సరాల అనుభవముంది. ఇక్కడ ముఖ్య విషయమేమిటంటే ఈయన 108 గంటలు కంప్యూటరు తో పనిచేసి గిన్నీస్ రికార్డ్ నెలకొల్పారు, ఇంకా ఒకేసారి 29 ఇంజనిరింగు సబ్జెక్టులను కంప్లీట్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు.

మదన్ మోహన్ గారు : వీరికి ఐటిలో 6 ఏళ్ళ అనుభవముంది.

కృష్ణ కళ్యాణ్ గారు : వీరు CSCలో బిజినెస్ డెవలప్‍మెంట్ విభాగంలో పనిచేస్తున్నారు.

మురళి, స్నేహితులు

వెంకటరమణ, మురళిగారు, నాగప్రకాశ్, మదన్ మోహన్, కృష్ణకళ్యాణ్

తర్వాత కూడలి కబుర్లలో ముచ్చట్లు, అంతర్జాతీయ సమావేశాలు, ప్రపంచ బ్లాగర్ల సమావేశం గురించిన చర్చ జరిగింది. రావుగారు ఈ కబుర్లలో సమయం వృధా అవుతుంది అనవసరపు కబుర్లతో అని. కాని మిగతా సభ్యులు ఒప్పుకోలేదు. ఈ కబుర్ల వల్లే శ్రీధర్ కి ఓ పెద్ద వరం దొరికింది అన్నాం. అది… మాడ్యూలర్ కీబోర్డ్ లేఅవుట్ ద్వారా యూనీకోడ్ తెలుగు టైప్ చేయడం, అలాగే పరుచూరి శ్రీనివాస్ గారు చెప్పిన అక్షరమాల మొదలైనవి. ఈ కబుర్ల వల్ల సరదా కబుర్లతో పాటు పనికొచ్చే మాటలు కూడా జరుగుతున్నాయని నేనన్నాను. కాని ఈ కబుర్ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు బ్లాగర్లు ముఖాముఖీ కబుర్లాడుతున్నారని అందరూఒప్పుకున్నారు. మురళిగారు ఇదే ముచ్చట్లు Skype ద్వారా ఆడియో చాట్ చేయొచ్చు అన్నారు. అది మన అమెరికా బ్లాగర్లు చేసారుగా. ముందుగా మురళిగారు తన బ్లాగు, వెబ్‍సైట్ల రచనలన్నీ లేఖిని ద్వారా చేస్తున్నానని, దాని సృష్టికర్త వీవెన్ కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. తన వంతు కృషిగా నెలకు పది గంటలు తెలుగు కోసం కేటాయించగలనన్నారు.ఇంతవరకు అందరు బ్లాగులు రాస్తున్నారు విజయవంతమయ్యారు. కాని దీనికి ఇంకా ప్రచారంజరగాలని వారి అభిప్రాయం. దానికి దూర్వాసుల పద్మనాభంగారు వివిధ తెలుగు గుంపులలో ప్రచారం చేయవచ్చు అని అభిప్రాయపడ్డారు. ఈ ప్రచార కార్యక్రమంలో తన వైపు నుండి ఏటువంటి సాయమైనా చెయ్యడాని మురళిగారు సుముఖత వ్యక్తం చేసారు.

పద్మనాభం

దూర్వాసుల పద్మనాభంగారు

ఒక వైపు ఈ ముచ్చట్లు జరుగుతుండగానే కందర్ప కృష్ణమోహన్ అలవాటు ప్రకారం, తను తెచ్చిన స్వీట్లు , హాట్లు అందరికి ఇచ్చేసాడు. అందరు తింటూ మాట్లాడుతున్నారు. తర్వాత కేకు డబ్బా మూత తెరిచి, తెవికీ పుట్టినరోజని ప్రకటించారు. ఐతే దానిని ఎవరు కట్ చేయాలని ఆలోచిస్తుంటే ఆవకాయ నుండి అణుబాంబు వరకు రాస్తాను అని చెప్పిన రావుగారిని తెవికీలో కూడా రాయాలని ఆహ్వానిస్తూ ఆయనచేతనే కట్ చేయించి అందరు తీసుకున్నారు.

తెవికి పుట్టినరోజు

తెవికి పుట్టినరోజు వేడుక

పక్కనే కృష్ణమోహన్ తెవికీలో అసలు ఏం రాయాలి అని అడిగాడు. నేనన్నా నీకు నచ్చిన, తెలిసిన విషయం తెవికీలో ఉందా చూడు.లేకుంటే రాసేయ్ అన్నా. పుస్తక ప్రదర్శన కొచ్చిన వారు ఇదేంట్రా గోల అని తొంగి చూసుకుంటూ వెళుతున్నారు. కొందరు నిలబడి ఐదు నిమిషాలు విని అర్ధం కాక వెళ్ళిపోయారు.కాని ఒక అబ్బాయి మాత్రం శ్రద్ధగా విని వీవెన్ , శ్రీదర్ పక్కన చేరి eతెలుగు అంటే ఏంటి, తెలుగు ఎలా రాయాలి అని అడిగి తెలుసుకుని వెళ్ళాడు.

దూర్వాసుల పద్మనాభం గారు మనం చేస్తున్నా ఈ సకార్యానికి తప్పకుండా పబ్లిసిటీ ఉండాలని చెప్పారు. అంతే కాకుండా క్రాస్ సైట్ పబ్లిసిటీ ఉండాలని తన వైపు నుండి యెదైనా సాయం కావాలంటే చేస్తానని వలివేటి గారు చెప్పారు.

వీవెన్, శ్రీధర్, శ్రీనివాసరాజు, కృష్ణమోహన్ మన eతెలుగు పుస్తకం ప్రతులను పుస్తక ప్రదర్శనలు, సాహితీ సదస్సులు, మొదలగు వాటి దగ్గర పంచడానికి ఎవరైనా ముందుకు రావాలి అని అభిప్రాయపడ్డారు. వలివేటిగారి ఏదన్నా పనికి ఒక కార్యాచరణ తప్పకుండా ఉండాలని అన్నారు. అధికారికంగా కూడా ఉంటే పనులు నెరవేరుతాయని చెప్పారు. చీకటి పడుతుందని నేను అందరికి వీడ్కోలు పలికి వెళ్ళిపోయాను.

తర్వాత సంభాషణంతా ఈ-తెలుగు ప్రణాళికల మీదే జరిగింది. ఈ-తెలుగు సైటున్లో అందరికీ ఉపయోగపడే విషయాలు ఏమేం ఉండాలో ప్రతిపాదించారు. మరికొంతసేపు కూర్చున్న తర్వాత సిబీరావుగారు, వలివేటి మురళిగారు,స్నేహితులు వీడ్కోలు చెప్పారు. తర్వాత అందరమూ సెలవు తీసుకున్నాం.

వలివేటి మురళి

వలివేటి మురళి కృష్ణ


వలివేటి గారి సలహాలు:

 • చక్కటి ప్రణాలికాబద్దంగా ముందుకెళ్ళడం. సంస్థ ఉద్దేశ్యాలు స్పష్టంగా ఉండాలి.
 • e-telugu.org లో మనం సాధించినవి , సాధించాల్సినవి , కృషిచేస్తున్నవారు , తెలుగు బ్లాగర్ల వివరాలు, తెలుగు ఉపకరణాలు, అవి అందించే సంస్థలు పొందుపచబడి ఉండాలి.
 • ఇంటర్నెట్లో తెలుగు భాషాభివృద్ధికై జరుగుతున్న కృషిపై మీడియాలో వస్తున్న ప్రచారవార్తల సంకలనం ఉండాలి
 • ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాల ద్వారా ఈ కృషికి వ్యాప్తి.
 • డబ్బులేకుండా ఏ పనీ జరగదు, నిలువలేదు కాబట్టి, ఆర్ధిక వనరులను సమకూర్చుకునే ప్రణాళిక.
 • తెలుగు ఫాంట్ల సేకరణ, "అను స్క్రిప్ట్ మాదిరి నేరుగా తెలుగులో టైప్ చేసుకునే మార్గం".
 • తెలుగు భాషా బ్రహ్మోత్సవాల వంటి కార్యక్రమాల విజయానికి దోహదపడటం.- రాజకీయాలకు అతీతంగా.
 • ఒక చక్కటి ఆన్‍లైన్ నిఘంటువును (వీలైతే ఉచితంగా) అందరికీ అందుబాటులోకి తీసుకురావడం.
 • ఈ-తెలుగు ఒక కన్సల్టెన్సీ మాదిరి, వివిధ వాణిజ్య సంస్థలకు తెలుగు పత్రికలనూ, పుస్తకాలనూ, పాటలనూ, సినిమాలనూ, ఇంకా అందరికీ అవసరమయ్యే తెలుగు విషయాలను/ఉత్పత్తులను ఎలా పెట్టవచ్చో నేర్పించడం.ఆదాయం కూడా రావచ్చు. ఆ సంస్థలు లాభానికి చెయ్యొచ్చు.

తెలుగుదనం తరపున ఆయన చేయాలనుకుంటున్నవి:

 • తెలుగు సంఘాల సేకరణ
 • తెలుగు సమూహాల సేకరణ
 • ఆర్కుట్
 • మన తరఫున న్యూస్‍లెటర్ ఏదైనా ప్రచురించి ఇస్తే, అది అందరికీ పంచడం (ఈ-మెయిళ్ళ ద్వారా)
 • ఈ-తెలుగు సైటు నిర్వహణకు చీరాల నుండి చేయదగిన పనులకు నెలకు 10 గంటలు కేటాయించడం, ఉదా:- ఈ-తెలుగు వార్తల సంకలనం
 • తెలుగీకరణ, స్థానికీకరణ పనులలో "టెస్టింగ్" బాధ్యత

కమర్షియల్‍గా చేయాలనుకునేవి:

 • తెలుగు బుక్స్ డిజిటలైజేషన్ , కన్వర్షన్ ప్రాజెక్ట్
 • తెలుగు ఆడియో/విజ్యువల్ కంటెంట్ డెవలప్‍మెంట్ ప్రాజెక్టులు
జోడింపుకొలత
computer books.jpg165.13 కిబై
all waiting.jpg173.58 కిబై
murali and his friends.jpg168.57 కిబై
doorvasula padmanabham.jpg144.13 కిబై
happy birthday wiki.jpg177.54 కిబై
murali.jpg86.17 కిబై

చాలా కాలం

చాలా కాలం తరువాత, చక్కటి e-తెలుగు సమావేశ నివేదిక చదివాను. గతంలో దీప్తిధార లో వివరంగా ఉన్నట్లుగా, సమగ్రం,సచిత్రం గా వుంది.జ్యోతి మరియు దాట్లకు అభినందనలు. e-Telugu society ప్రస్తుతం dormant గా వుంది.దానిని మరలా చేతనం చెయ్యవలసిన అవసరం కనిపిస్తుంది.

jyothi మరికొన్

jyothi

మరికొన్ని సమావేశ చిత్రాలు ఇక్కడ.. http://jyothivalaboju.blogspot.com

నేను కూడా

నేను కూడా వచ్చా కానీ 5 అయిపోయింది. అయినా ఆశచావక మీకోసం చూసా. ఎవరూ కనిపించక బుక్ ఫెయిర్ లోకి దూరా. చాలానే మిస్సయ్యానని అర్ధమయింది మీ రాత, బొమ్మలూ చూసాక.
సత్యసాయి

కందర్ప

కందర్ప కృష్ణమోహన్
అయ్యో సత్యసాయి గార్ని మిస్సయ్యామా....ప్చ్ (త్రివిక్రమ్ కూడా వచ్చినట్లు అభిజ్ఞవర్గాల భోగట్టా)

నివేదిక చాలా బావుంది, అక్కా ఈ విషయంలోనూ మార్కులు కొట్టేశావు, నాబద్ధకం ఎప్పటికి వదిలించుకుంటానో ఏమో..

మిత్రులకు

మిత్రులకు నమస్తే.

ఈనెల సమావేశ సమయానికి హైదరాబాదు రావడం, తెలుగుకై కృషిచేసే అతిరధ మహారధులను ముఖాముఖి కలవడం, నేను అక్కడ చెప్పినట్లుగా చాలా సంతోషం కలుగజేసింది. ఈ అవకాశం నాకు కలుగజేసిన శ్రీధర్ గారికి, జ్యోతి గారికి మరొక్కసారి ధన్యవాదములు.

సభ్యులలో చాలా ఉత్సాహం, అవగాహన, సమిష్టిగా కృషి చేసే మనస్తత్వం కనిపించాయి. ఈ కృషీ మరియు పురోగతి కొనసాగాలనీ, ఇంకా అభివృద్ది చెందాలనే తపన ఉన్నాయి. తెలుగు భాషకే ఇది ఒక వరం. అక్కడ నేను చెప్పినట్లుగా, ఇంటర్నెట్లో తెలుగుకు సముచిత స్థానాన్ని అర్జించి పెట్టగల సత్తా ఈ ఈ-తెలుగు.orgకే వుంది. ఓ 20 మంది దాకా గట్టి కృషీవలురు వున్నారు. చక్కగా సమన్వయంతో కృషిజరుపుతూ వున్నారు. నా దృష్టిలో మన దేశా స్థాయిలో IT Industryకి NASSCOM ఎంతో, ఇంటర్నెట్లో తెలుగుకు ఈ ఈ-తెలుగు.org అంత.

ఇటువంటి తెలుగు అశాకిరణం చిరస్థాయిగా వుండాలంటే strong formalization అవసరమని నా అభిప్రాయం. సంస్థ, అశయాలు, ప్రణాళికలు, సభ్యులు, డబ్బులు, తలనొప్పులు, తప్పనిసరి. గొప్ప గొప్ప ఫలితాలు సాధించాలంటే, ప్రభుత్వంతోగానీ, పెద్ద పెద్ద IT సంస్థలతోగానీ దీర్ఘకాళిక తెలుగు వ్యాప్తికై సంప్రతింపులు జరపాలంటే, సభ్యుల ఆశయాలు నిజమవ్వాలంటే, ఈ-తెలుగు.org మరో NASSCOM, మరో TANA అయ్యేట్లుగా, అంటే influence చేయగలిగేటట్లు ఎదగాలి. సులభం కాదు. కానీ, యువ కిరణాలతో నిండిన ఈ విప్లవానికి కష్టం కూడా కాదు. మాతృభాషకు చేసే ఈ సేవలో, నాయకులుగా కొందరు రాణిస్తారు. సాంకేతికంగా కొందరు రాణిస్తారు. ప్రతి ఒక్కరి శ్రమకు ఏదో ఒక ఉపయోగం వుంటుంది. ఇంటర్నెట్లో తెలుగు వర్ధిల్లుతుంది.

చీరాలలో ఉంటూ నిర్వహించగల ఏ భాధ్యతనైనా తీసుకోవడానికి నేను సిధ్ధం అని మాట ఇస్తూ, మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.

నమస్కారములతో,
'తెలుగుదనం' మురళీ కృష్ణ

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer