e-తెలుగు హైదరాబాదు సమావేశం ఆగష్టు 2007

ఎప్పటిలానే ఈసారి కూడా ఈ-తెలుగు సమావేశం ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగింది. చావా కిరణ్ గారి ఇంట్లో జరిగిన ఈసారి సమావేశానికి హాజరయిన వారు:

 1. చావా కిరణ్
 2. శోధన సుధాకర్
 3. దూర్వాసుల పద్మనాభం
 4. త్రివిక్రం
 5. వెంకట రమణ
 6. వీవెన్
 7. సి.బి.రావు
 8. శ్రీనివాసరాజు దాట్ల
 9. నల్లమోతు శ్రీధర్
 10. కందర్ప కృష్ణ మోహన్
 11. PPC జోషి
 12. జాన్ హైడ్ కనుమూరి
 13. కట్టా విజయ్ కుమార్

ఈసారి క్రొత్త సభ్యులు ఉండటంతో మరోసారి అందరూ తమగురించి తాము స్వల్ప పరిచయం చేసుకొన్నారు. వీరిలో, ఈసారి క్రొత్తగా వచ్చిన వారి పరిచయం.
దూర్వాసుల పద్మనాభం గారు :
http://www.telugugreetings.fotorima.com/ సైటు నిర్వాహకులు. ఆంగ్లంలో ఎన్నో శుభాకాంక్షలు తెలియజేసే సైట్లున్నప్పటికీ, తెలుగులో అసలేమీ లేకపోవడం చూసి, తెలుగులో కూడా అలాంటి సైటు ఒకటి మొదలు పెట్టాలన్న ఆలోచనతో, ఈసైటును వీరు తయారు చేశారు. ఏడు పదుల వయసులో కూడా వీరికి ఉన్న ఉత్సాహం అందరినీ ఆశ్చర్యపరచినది.
PPC జోషి గారు:
ప్రాచీ పబ్లికేషన్స్ అనే ప్రచురణ సంస్థాదిపతి. వీరి ప్రచురణా సంస్థ మనకు ప్రస్తుతం అందు బాటులో లేని పాత పుస్తకాలనెన్నింటినో పునర్ముద్రించింది, ఇంకా ముద్రించబోతోంది. వీరు కూడా దాదాపు ఏడు పదుల వయసులో ఉన్నా, సమావేశంలో పాల్గొనడానికి ఎంతో ఉత్సాహంతో 3 గంటల ప్రయాణం చేసిమరీ వచ్చారు. వీరికి స్వర్గీయ బూదరాజు రాదాకృష్ణగారు చాలా మంచి మితృలు, వారు వ్రాసిన వ్యావహారిక పదకోశము(పేరు సరిగా గుర్తులేదు) మూడో భాగాన్ని అంతర్జాలంలో ఉంచాలని జోషిగారి కోరిక.
జాన్ హైడ్ కనుమూరి గారు :
వీరి గురించి తెలుగు బ్లాగర్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు, హృదయాంజలి, ప్రేమ తాజమహల్ సాహిత్యం, జాన్‌హైడ్ కనుమూరి, మరియు నా కవితా సంపుటి అనే బ్లాగులను వ్రాస్తూ తెలుగు బ్లాగర్లందరికీ పరిచయస్తులయ్యారు.
కట్టా విజయ్ కుమార్ :
ఈమద్యనే B.Tech పూర్తి చేశారు. జాబిల్లి అనే బ్లాగు వ్రాస్తుంటారు.

పరిచయాలయ్యాక, చర్చ తెలుగు ఫాంటులమీదకు మళ్లింది. జోషిగారు మాట్లాడుతూ, ప్రస్తుతమున్న తెలుగు ఫాంటులన్నీ కేవలం కథలు, కవితలు లాంటివి మాత్రమే పనికొస్తాయని, వ్యాకరణం లాంటి వాటి గురించి వ్రాయడానికి కావలసిన ప్రత్యేక గుర్తులు వాటిలో ఉండవని చెప్పారు. పాతరోజుల్లో అయితే అక్షరాలన్ని అచ్చుపోసి ఉండేవి కాబట్టి వాటిని కొంచం అటూ-ఇటు మార్చి వారికి కావలసిన గుర్తుగా మార్చుకొనేవారని చెప్పారు. అయితే కంప్యూటరు ఫాంటులో కూడా ఇలా మనకు కావలసిన గుర్తులను కలుపుకోవచ్చని, అయితే వాటికి కొన్ని సాఫ్టువేర్లు, వాటిని వాడండం తెలిసినవారు అవసరమని తెలియజేయడం జరిగినది.

చావా కిరణ్, ఈనాడు అయిపోయింది కాహట్టి ఇక తరువాత ఎక్కడెక్కడ ప్రచారం చేయాలి, మిగతా పత్రికలలో కూడా వ్యాసాలు రావాలంటే ఏమి చేయాలి అన్న విషయం మీద కొంచం సేపు చర్చను లేవదీశారు. మన తెలుగు బ్లాగర్లలో కొందరు ఇతర పత్రికల జర్నలిష్టులున్నారు కాబట్టి, వీలయితే వారిద్వారాకూడా ప్రయత్నించ వచ్చన్న అభిప్రాయం వ్యక్తమయింది. నల్లమోతు శ్రీధరుగారు కేవలం పత్రికలే కాకుండా తెలుగులో వచ్చే వివధ కంప్యూటరు మాగజైనుల ద్వారా కూడా తెలుగు బ్లాగులకు ప్రాచుర్యం కల్పించవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుధాకర్ మాట్లాడుతూ, తెలుగు బ్లాగులు చదివేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపాలంటే కూడలి, జల్లెడ వంటి సైట్లను teluguone లాంటి కమర్షియల్ సైట్లకు ధీటుగా తమారుచేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

తరువాత, వీవెన్ తెలుగీకరణ పనుల స్థితిని వివరించారు. వాటిని కొంచం వేగిరపరచాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తపరచారు. వికీ వ్యాఖ్యలో చాలా రోజులుగా ఏ విధమయిన మార్పులు లేనందువలన, దానిని మూసెయ్యాల్సిన అవసరం రాబోంతుందని, ఎవరైనా కనీసం వారానికి ఒకటి రెండు మార్పులైనా చేస్తేనే కాని దానిని కొనసాగించడం సాధ్యపడదని తెలియజేయడంతో, శ్రీనివాసరాజు మరియు త్రివిక్రం ఆ బాధ్యతను తలకెత్తుకున్నారు.

తరువాత, తెలుగుపదం గుంపు గురించి కొంత చర్చజరిగినది. జోషిగారు మాట్లాడుతూ, మన దేశంలో ఒక వర్గంవారు, తమకంటే గొప్పదిగా భావించే మరో వర్గాన్ని అనుకరిస్తుంటారని, అందువలన భవిష్యత్తులో తెలుగువాడకం క్రమేణా పడిపోతుందని తెలియజేశారు. ఆయన హైదరాబాదు వచ్చినకొత్తలో(1950ప్రాంతంలో) లక్డీకాపూల్, పురాణా పూల్, నయాపూల్ లను తెలుగులోనే పిలిచేవారని వాటిపేర్లుకూడా తెలియజేశారు(నాకు గుర్తురావడంలేదు, గుర్తున్న మితృలెవరైనా వ్యాఖ్యలలో తెలియజేయగలరు). మనమంతా ఒక చీకటి గదిలో(dark room) కూర్చుని క్రొత్త పదాలు సృష్టించే పనిచేయడం వల్ల ఆపదాలన్నీ జనాలు వాడకపోవచ్చని తెలియజేశారు. దీనికి సమాధానంగా, ప్రస్తుతం బ్లాగర్లు చాలా మంది ఉండడం వల్ల తెలుగుపదం ద్వారా సృష్టించిన పదాలు జనాలలోనికి తీసుకెలడం సులభమని, తెలుగుపదంలో సృష్టించిన తెలుగు పదాలు జనాలకు నచ్చితేనే ప్రాచుర్యం పొందుతాయని మిగతా బ్లాగర్లు తెలియజేశారు. ఈ సందర్భంగా మృదులాంత్రం, తిప్పెన లాంటి పదాలను ఆయనకు ఉదహరించడం జరిగినది.

ఇంకా, తెలుగు బ్లాగుల పుస్తకం ప్రచురించడాని ఖర్చెంతవుతుందో జోషిగారినడిగి తెలుసుకొనే ప్రయత్నం చేశాము. దాదాపు 200 పేజీల పుస్తకం 500 కాపీలు వేయిస్తే, 30-35 వేల వరకు అవ్వొచ్చని తెలియజేశారు. అయితే, పుస్తకం వేయించేముందుగా మన పుస్తకం ఎవరికోసమో ముందుగా నిర్ణయించుకొని, మనం ఆ పుస్తకాన్ని ప్రచురించడం వల్ల కలిగే లాభనష్టాలను బేరీజువేసుకొవాలని ఆయన అన్నారు.

జాన్‌హైడ్ కనుమూరిగారు, తమకు బ్లాగులు ఎలా పరిచయమయినది వివరించారు. దార్లగారు తమకు మితృలని, వారి ద్వారానే బ్లాగులు పరిచయమయ్యాయని తెలియజేశారు. దూర్వాసుల పద్మనాభంగారు తమ గ్రీటింగ్స్ సైటునిర్వహణలో ఎదుర్కొంటున్న ఆటుపోట్లగురించి బ్లాగర్లతో ముచ్చటించారు. జోషిగారి పేరుచూసి, సి.బి.రావుగారు మీరు తెలుగువారేనా, మీ పేరు అలాఉందేమిటని ప్రశ్నించగా, జోషిగారు వివరిస్తూ P.C.జోషిగారని ఒక పెద్ద కమ్యూనిష్టు నాయకులున్నారని, ఆయన పేరే తనకు పెట్టారని వివరించారు.

ఇలా సమావేశం జరుగుతున్నంత సేపు, చావా కిరణ్‌ రకరకాల పిండివటలతో, తేనీటితో కడుపునింపే కార్యక్రమంలో మునిగితేలగా, జోషిగారు తమ సంభాషణా చతురతతో అందరినీ కడుపుబ్బానవ్వించే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు.
మధ్యాహ్నం మూడు గంటలకు మొదలయిన సమావేశం సాయంత్రం 7 వరకు మాటలప్రవాహంలో సమయమే తెలియకుండా గడచిపోయినది. ఏడు గంటలకు, ఇక బయలుదేరదామని అందరూ తమతమ కుర్చీలలోంచి లేచి నుంచొని, ఇంకో అరగంటపాటు చర్చనుకొనసాగించారు. అయితే, చివరకు రావుగారు అన్ని మంచి విషయాలకు ఒక అంతం ఉంటుంది అని ఇంగ్లీషులో చెప్పి సమావేశాన్ని ముగింపజేశారు :).

(నాకు గుర్తున్నంత వరకు నేను వ్రాశాను. ఏమైనా వదిలేసినా, తప్పుగా వ్రాసినా సమావేశానికి వచ్చిన వారు వ్యాఖ్యలలో తెలియజేయగలరు.)

ఈ-తెలుగు

ఈ-తెలుగు సమావేశాం కళ్ళ కు కట్టినట్లు బాగా వ్రాశారు

కొత్త

కొత్త నిర్ణయాలు, పాత నిర్ణయాల సమీక్ష వంటివి చెయ్యలేదా? పొద్దు, జెల్లెడ లను పముఖ తెలుగు సైట్లకు పోటీగా ఉంచాలని మంచి నిర్ణయం తెలియపరిచారు. బాగానే ఉంది. కానీ దానిని నిర్ణయం (Action Item)గా తీసుకున్నారా లేదా? దానికి తగిన ఆలోచనలు చేశారా లేదా? ఒక ఆరు నెలలకు సరిపడ్డ పత్రికా వస్తువులను సమకూర్చుకొని, క్రమం తప్పకుండా ఆసక్తికర కథా, కథనాలను అందిస్తూ, విచిత్రమైన పద్దతులతో విపనీకరణ (marketing?) చేస్తే బాగుంటుందేమో. పుస్తక ముద్రణకు 35 వేలు కావాలన్నారు. వాటిని అధికార భాష సంఘం ఏమన్నా స్పాన్సర్ చేస్తుందేమో కనుక్కోవాలి. చిన్న ఆలోచన చేస్తున్నా అంతే....."ఆ ....ఆ పని అయ్యేనా పొయ్యేనా" అని గమ్మునా ఉంటే కంటే..ఏదో ఒక ప్రయత్నం చెయ్యటం తప్పులేదు కదా.
ప్రతి ఆదివారం డా॥మృణాళిని గారు తెలుగు వ్యాప్తి కావాలంటూ సెల్ నంబరు ఇస్తూనే ఉన్నారు. హైదరబాదులో ఉన్నా జనాలు కాస్తంత వారి అప్పాయింటుమెంటు తీసుకొని, ఈటీవీ-౨లో మన పని ఏమన్నా జరుగుతుందేమో మాట్లాడచ్చు కదా.
(మరి నువ్వేం చేశావ్ అని అడగకండి....నేను మిమ్మల్ని దబాయిస్తున్నాను అని చెప్పలేను ;) )
--
నవీన్ గార్ల
http://gsnaveen.wordpress.com

కందర్ప

కందర్ప కృష్ణమోహన్

తెలుగు పేర్లు - లక్డీకాపూల్ కి కట్టెవాలాద్రి అలాగే మిగతావాటికి పాతవాలాద్రి, కొత్తవాలాద్రి అని వ్యవహరించే వాళ్ళమని జోషి గారు చెప్పారు.
వెంకటరమణగారూ మినిట్సు మాబాగా రాశారు..

సమయం మూడు

సమయం మూడు ఎప్పుడెప్పుడవుతుందా అని ఎదురుచూస్తున్నాను, మీరు రాసింది(చూపించింది) చదివాక.
భాగ్యనగరం 'నంద'.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer