జూలై నెల బెంగుళూరు సమావేశాలు

మొదటిగా, శుక్రవారం సాయంత్రం నవీన్ గార్ల గారి నుండి gtalk‌లో నాకు పిలుపు వచ్చింది. శనివారం కానీ, ఆదివారం కానీ కలుద్దామని చెప్పారు. సరేమరి ప్రవీణ్‌ను కూడా అడిగి నాకు ఎప్పుడు ఎక్కడికి రావాలో ఫోను చేసి చెప్పండని, చెప్పాను. అంతకు ముందు రోజు రవికుమార్ మండాలా నా దగ్గరకు వచ్చి ఈ వికీపీడియా కధా కమీషూ ఏమిటో కనుక్కుందామని, శనివారం నా రూముకు వస్తానన్నాడు.

ఎప్పటిలాగానే శనివారం ఆఫీసులేదని కొంచెం ముందే నిద్రలేచాను :) ఏంచేయాలో తోచక వికీపీడియాలో వ్యాసాలను కెలుకుతూ కూర్చున్నాను. రవీ వస్తాననడం గుర్తొచ్చి, రమ్మని ఫోను చేసాను. ఇంకో అరగంట తరువాత ఎప్పుడూ సైలెంటు మోడులో ఉండే నా సెల్లులోని మిస్సుడు కాల్సు చూస్తే నవీన్ దగ్గర నుండి ఒక కాల్ వచ్చిందని ఉంది. ఫోన్‌చేస్తే నవీన్, ప్రవీణ్ ఇద్దరూ సమావేశమై అప్పుడే గంటయ్యిందని చెప్పాడు. రవీ వచ్చేవరకూ ఆగి అతనిని కూడా అటు పట్టుకెళ్ళాను.

వెళ్ళిన వెంటనే ఒక ప్లేటులో కాజూబర్ఫీ, ఇంకో ప్లేటులో హాటు వచ్చేసాయి మా దగ్గరకి. ఇంకొంచెం సేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నా తరువాత ప్రవీణ్, నవీన్ తయారు చేద్దామనుకుంటున్న తెలుగు సహాయక వీడియోలు ఎలా తయారు చేద్దామనుకుంటున్నదీ చెప్పి, వాళ్ళు అప్పటికే తయారు చేసిన, ఒక చిన్న వీడియోను చూపెట్టారు. చాలా బాగా వచ్చింది ఆ వీడియో. ఆ తరువాత గంటా, రెండు గంటలు ఏవేవో చర్చించాము, వాటిలో ముఖ్యమైనవి ఇవి:

  1. ఇంటర్నెట్టులో తెలుగును బాగా వ్యాప్తి చేయటానికి పనికి వస్తాయనుకునే ఆలోచనలను అన్నీ ఒకేచోట ఎప్పటికప్పుడు చేర్చడం. ఈ-తెలుగు సంఘాన్ని, ఏర్పాటు చేసిందే అందుకు కదా మరి. ఇదేకాదు తెలుగు ప్రచారానికి అవసరమైన వ్యాసాలను కూడా తయారు చేసి, వాటన్నిటినీ కూడా ఒకే చోట పదిలపరిస్తే బాగుంటుందని అనుకున్నాము.
  2. కంప్యూటరులో తెలుగును స్థాపించటానికి సహాయపడే వీడియోలను మరిన్ని తయారు చేయటం. ఒక పేజీడు సూచనలకన్నా 2 నిమిషాల వీడియో చూస్తే ఇంకా తొందరగా బాగా తెలుసుకోవచ్చు కదా మరి.
  3. తెవికీకి ఒక Recruitment Bulletinని మొదలు పెడితే ఎలా ఉంటుందో అనే కూడా ఒక ముఖ్యమైన విషయం. రాశిలో తెవికీ భారతీయ వికీలన్నిటికన్నా ముందుంది అనేది అందరికీ తెలిసిందే. వాశిలో మాత్రం మనం కన్నడ, తమిళ భాషలు మనకు చాలా పోటీని ఇస్తున్నాయి, అవి మనకంటే ముందు కూడా ఉండి ఉండవచ్చు. అయితే తెవికీని వాశిలో కూడా ముందుంచే చిన్న ఆలోచన ఇది. తెవికీలో ప్రస్తుతం బోలెడన్ని వ్యాసాలు మెరుగుపరచటానికి ఎదురుచూస్తున్నాయి. ఎవరెవరికి ఏ ఏ రంగాలలో ప్రవేశముందో లేదా ఇష్టముందో తెలుసుకుని వారిని తెవికీలో ఆయా వ్యాసాలను మెరుగుపరచటానికి ప్రోత్సహించటం ఈ Bulletin యొక్క ముఖ్యోద్దేశం.
  4. తెవికీలో అనువాదాలకు వ్యాసాలను ఆంగ్లవికీ నుండే కాకుండా ఇతర భారతీయ భాషలనుండి కూడా తేగలిగితే ఎలాఉంటుందో అని కొంచెం సేపు చర్చించాము. ఉదాహరణకు తెవికీలో ఉన్న ఈ పేజీని చూడండి, దీనిని కన్నడ వికీ నుండి అనువదిస్తున్నారు.
  5. తెవికీకో ఉన్న అన్ని సహాయ పేజీలకు WP:5MINలా ఉండే సంక్షిప్త పేర్లతో దారిమార్పు(redirect) పేజీలను సృష్టించాలి అనికూడా అనుకున్నాము. దీనివలన మన గుంపులలో ఎప్పుడయినా ఆ పేజీలకు లింకులను ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇలాంటి సంక్షిప్త చిరునామాలయితే సులువుగా ఉంటుండి.
  6. మాటల మధ్యలో తెవికీలో RTS-తెలుగు Transliteratorని ఇంకోంచెం వేగంగా పనిచేయించటానికి ప్రయత్నించాలని అభిప్రాయపడ్డాము.
  7. పేరుకి బ్లాగరుల సమావేశం అనే మనం పిలుస్తున్నా కానీ, ప్రతీ సారీ బ్లాగరులు మరియు వికీపీడియనులు కూడా ఈ సమావేశానికి వస్తున్నారు. అందుకని ఈ సమావేశాలకు "ఈ-తెలుగు సమావేశం" అనే పేరే సరయినదని కూడా కొంచెం సేపు చర్చించుకున్నాం.

అప్పటికి మధ్యాహ్నం 2:30 అయ్యింది. మొదటి సమావేశంలో అనుకునట్లు MTRలో తినలేక పోయినా, అంతకంటే ఎన్నోరెట్లు రుచికరమైన విందు భాజనం చేసాము. అందునా ఆ విందులో వడ్డించిన వంకాయ కూర అదుర్స్. కాబట్టి ఇంక వారం వారం సమావేశాలు జరగాలని కోరుకుంటున్నాను. భోజనం ముగించిన తరువాత కొంచెం సేపు లినక్సు గురించీ ఉబుంటూ ఉచిత CDల గురించి మాట్లాడుకున్నాము. ఆ తరువాత జరిగిన సన్నివేశాలన్నీ మీరు ప్రవీణు రాసిన పోస్టులో ఇప్పటికే చదివేసి ఉంటారు.

నలుగురమూ కలిసినందుకు గుర్తుగా(రుజువుగా) చివరిలో ఈ ఫొటో తీసుకున్నాము. ఫొటోలో ఎడమ నుండి కుడి వైపుకు, నేను, ప్రవీణ్, తెవికీ, నవీన్, రవీ నుంచున్నాము.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer