ఈ కార్యకలాపం యొక్క ముఖ్య ఉద్దేశం జాలంలోనూ కంప్యూటర్లలోనూ తెలుగుకై యూనికోడ్ వాడకాన్ని పెంపొందించడం. ప్రస్తుతం తెలుగుకై పలు యూనికోడేతర పద్ధతులు అమలులో ఉన్నాయి. వాటి పరిమితులూ నష్టాల నుండి విముక్తికై కృషిచేయడం కూడా దీనిలో భాగం.
ప్రస్తుత పరిస్థితి - యూనికోడేతర పద్ధతులు
తెలుగులో వెబ్ సైట్లని సాధారణంగా యూనికోడ్ సంకేతలిపి (encoding)తో నిర్మించాలి. కానీ చాలా వరకు తెలుగు వెబ్ సైట్లు పాఠ్యాన్ని బొమ్మలుగా గానీ లేదా ప్రైవేటు సంకేతలిపిలో గానీ ప్రచురిస్తున్నాయి. కొన్ని సైట్లు పూర్తిగా ఇంగ్లీషులో ప్రచురిస్తున్నాయి. దీనివల్ల చాలా తెలుగు సమాచారం జాలంలో ఉన్నా దాన్ని అన్వేషించలేము మరియు ఇతర కంప్యూటింగ్ అవసరాలకి మరియు సమాచార పక్రియాపన (information processing)కి ఉపయోగించుకోలేము.
యూనికోడేతర పద్ధతుల వల్ల నష్టాలు
పాఠ్యం బొమ్మలుగా ఉండటం వల్ల:
- ఆ పాఠ్యాన్ని వెతకలేము.
- బొమ్మలు విలువైన బ్యాండ్‌విడ్త్‌ని (వెబ్ సైటుకీ మరియు దాని వాడుకర్లకీ) ఖర్చుచేస్తాయి.
- (చూడటం తప్పితే) ఆ సమాచారాన్ని కంప్యూటర్ ద్వారా ఉపయోగించుకోలేము.
ప్రైవేటు సంకేతలిపులలో ఉండటంవల్ల:
- ఆ పాఠ్యాన్ని వెతకలేము (ఒకటి అర సెర్చింజన్ల లో తప్ప).
- ఆ పాఠ్యాన్ని అన్ని నివ్యలు మరియు విహారిణులూ సరిగా చూపించలేవు.
- (చూడటం తప్పితే) సమాచారాన్ని కంప్యూటర్ ద్వారా ఉపయోగించుకోలేము.
ఇంగ్లీషులో ఉండటంవల్ల:
- ఇంగ్లీషు రాని తెలుగు వారికి ఆ సమాచారం ఉపయోగపడదు
కారణాలు మరియు నివారణోపాయాలు
కంప్యూటర్లలో తెలుగు ఎలా వస్తుందో తెలియకపోవడం: చాలా మందికి (కంప్యూటర్ బాగా తెలిసినవాళ్ళకి కూడా) కంప్యూటర్లలో తెలుగు చదవడం మరియు వ్రాయడం సులువని తెలియదు. వెబ్ సైట్లు సృష్టించేవారికి యూనికోడ్ సరికొత్త సాంకేతికాంశాలపై అంతగా అవగాహన లేకపోవడం.
- తెలుగులో సమాచారం సృష్టించే వారికి (రచయితలు, విలేఖరులు, మొదలైనవారికి), కంప్యూటర్లలో తెలుగు రాయడం చాలా సులువనీ అందుకోసం కావాల్సిన మృదుపరికరాలు ఉచితంగా కూడా లభిస్తున్నాయనీ తెలియజెప్పాలి.
- యూనికోడ్ ఎలా ఉపయోగించాలనే విషయంపై జాలంలో ఇప్పటికే ఉన్న వివిధ సమాచార వనరులని తెలుగు వెబ్ సైట్ల తయారీదార్లకు తెలియజెప్పాలి.
ప్రైవేటు సంకేతలిపులకు అలవాటు పడిపోయివుండటం: యూనికోడ్ వచ్చి చాలా కాలమైనా, (తెలుగుకి సంబంధించి) యూనికోడ్ తోడ్పాటు ఉన్న నిర్వాహక వ్యవస్థలూ మరియు ఇతర మృదూపకరణాలు గత ఐదారేళ్ళుగానే విరివిగా అందుబాటులోకి వచ్చాయి. ఇంతకు మునుపే, కొన్ని సంస్థలు ముద్రణారంగం కోసం తయారైన ప్రైవేటు సంకేతలిపులనే జాలంలోనూ తెలుగు ప్రచురణకై వినియోగించడం మొదలుపెట్టాయి. ఈ సంస్థలూ, వారి సిబ్బంధి ఈ ప్రైవేటు ఉపకరణాలకి అలవాటు పడిపోయి యూనికోడుకి మారడానికి వెనుకంజ వేస్తున్నారు.
- యూనికోడ్ వాడటం వల్ల వచ్చే ప్రయోజనాలు (లేదా జాలంలో ప్రైవేటు సంతేతలిపులు లేదా బొమ్మలుగా ప్రచురించడం వల్ల పైన చెప్పిన నష్టాలనుండి విముక్తి) దీర్ఘకాలం. యూనికోడ్‌కి మారడం అనేది ఒక్కసారి మాత్రమే చేయాల్సిన ప్రయత్నం. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానాల్ని అందుకోక పోవడం వల్ల కొత్త కొత్త వ్యాపారావశాలూ చేజారవచ్చు.
- ఇప్పటికే ప్రైవేటు సంకేతలిపులలో ఉన్న సమాచారాన్ని యూనికోడులోనికి మార్చగలగాలి. ఇందుకు కొన్ని పరికరాలు ఉన్నా వాటిని పూర్తిస్థాయి ఉపకరణాలుగా తీర్చిదిద్ది జనావళికి అందుబాటులోనికి తీసుకురావాలి.
మనమేం చేయొచ్చు
- యూనికోడుతో తెలుగు సైట్లను రూపొందించడం ఎలాగో ఎంత సులువో తెలియజెప్పాలి.
- సంప్రదాయ పద్ధతుల్లోని లోటుపాట్లు మరియు యూనికోడ్ వల్ల ప్రయోజనాల్ని తెలియజెప్పాలి.
- తెలుగు OCR లాంటి ఉపకరణాల్ని తయారుచేయాలి లేదా అటువంటి ప్రయత్నాలకి చేయూతనందించాలి.
- ప్రైవేటు సంతేకలిపుల నుండి యూనికోడుకి మార్పిడి పరికరాల్ని రూపొందించాలి లేదా అటువంటి ప్రయత్నాలకి తోడ్పడాలి.
ఇటీవలి వ్యాఖ్యలు
3 గంటలు 1 నిమిషం క్రితం
3 గంటలు 3 నిమిషాలు క్రితం
6 గంటలు 46 నిమిషాలు క్రితం
4 వారాలు 5 రోజులు క్రితం
5 వారాలు 53 నిమిషాలు క్రితం
5 వారాలు 16 గంటలు క్రితం
7 వారాలు 6 రోజులు క్రితం
9 వారాలు 6 రోజులు క్రితం
9 వారాలు 6 రోజులు క్రితం
11 వారాలు 2 రోజులు క్రితం